పరుగే జీవితం | Lady Conductor Swarajya Lakshmi wins gold medals in running race | Sakshi
Sakshi News home page

పరుగే జీవితం

Mar 7 2026 6:14 AM | Updated on Mar 7 2026 6:14 AM

Lady Conductor Swarajya Lakshmi wins gold medals in running race

బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్‌లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్‌ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది.  ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన  క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.

‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్‌ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్‌కి వెళ్లి రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్‌లో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్‌లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.

మార్చుకున్న షెడ్యూల్‌...
చదువుకునే రోజుల్లో రన్నింగ్‌ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్‌ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్‌ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్‌ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్‌ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. 

పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు  జాతీయ, అంతర్జాతీయ  పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్‌ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్‌ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్‌ టేబుల్‌ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్‌లో నా జీవన శైలి ఉంటుంది.  

విదేశీ  పోటీల్లోనూ...
దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్‌ కాంపిటిషన్‌లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్‌  పోటీల్లో పాల్గొన్నాను. 

ఈ యేడాది జనవరిలో అజ్మీర్‌లో జరిగిన రన్నింగ్‌ రేస్‌లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్‌ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్‌ ప్రైజ్‌ వచ్చింది.  పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.
మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్‌గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్‌గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. 
అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్‌ని ఎంచుకొని ప్రాక్టీస్‌ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్‌. 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement