రణరంగంలో నారీ శక్తి..! | the rise of women in Indias armed forces | Sakshi
Sakshi News home page

రణరంగంలో నారీ శక్తి..!

Mar 6 2026 4:28 PM | Updated on Mar 6 2026 4:57 PM

the rise of women in Indias armed forces

ఒకప్పుడు కేవలం వైద్య, నర్సింగ్‌ సేవలకే పరిమితమైన మహిళలు, నేడు భారత సైన్యంలో కీలక విభాగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. యుద్ధ విమానాలు నడపడం నుంచి ఫిరంగి దళాల నిర్వహణ వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలోనూ మహిళల పాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. క్షేత్ర స్థాయి పోరాటంలో, అత్యున్నత స్థాయి వ్యూహ రచనలో పాల్గొని మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికే చాటిచెప్పారు. 

ప్రస్తుతం భారత సాయుధ దళాల్లో మహిళల సంఖ్య గత ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం..

భారత సైన్యంలో సుమారు 8000 (వైద్య, నర్సింగ్‌ సేవలతో కలిపి) మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. 

2022 నుంచి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోకి మహిళా క్యాడెట్లను చేర్చుకోవడం ప్రారంభమైంది. ప్రతి ఆరు నెలలకు 19 మంది మహిళా అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి నేరుగా ఆఫీసర్లుగా నియమిస్తున్నారు.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత, మహిళా అధికారులకు కూడా పురుషులతో సమానంగా పదవీ విరమణ వరకు ఆర్మీలో కొనసాగడమే కాకుండా ఉన్నత పదవులను అధిరోహించగలుగుతున్నారు

సాధారణ అధికారులుగా (మెడికల్, నర్సింగ్‌ మినహా) విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య 2037. గతంలో ఇది 1732 ఉండేది. భారత ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలు సైన్యంలో మహిళల సంఖ్య పెరిగేందుకు దోహదం చేశాయి.

సుమారు 145 మందికి పైగా మహిళా అధికారులు ప్రస్తుతం కల్నల్‌ హోదాలో వివిధ యూనిట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 60% మంది సరిహద్దుల్లోని కార్యాచరణ ప్రాంతాలలో సేవలు అందిస్తుండటం విశేషం.

అగ్నిపథ్‌ పథకం కింద మహిళలను అగ్నివీర్‌లుగా రక్షణ దళాలలోకి తీసుకుంటున్నారు. నావికాదళంలో 20% ఖాళీలను మహిళలకే కేటాయించారు.

ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, టెక్నికల్‌ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నారు. లెఫ్టినెంట్‌ హోదాలో చేరే అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ. 56,000 పైగా స్టైపండ్‌ ఇస్తూ, గౌరవప్రదమైన కెరీర్‌ను ఆఫర్‌ చేస్తున్నారు.

కమాండింగ్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 115 మందికి పైగా ఉండగా.. మరో 145 మంది విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు ఆర్టిలరీ, ఇంజినీర్లు, సిగ్నల్స్‌ వంటి విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదాతి దళంలోకి సైతం మహిళలను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

మొదటిసారిగా టెరిటోరియల్‌ ఆర్మీలోని హోమ్‌ – హెర్త్‌ ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో మహిళా సైనికులను చేర్చుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 110 ఖాళీలను కేటాయించారు. 

భారత సైన్యం లక్ష్యం ప్రకారం సుమారు 1700 మంది మహిళలను దశల వారీగా  కోర్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌లో చేర్చుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి ఏటా 100 మందిని చేర్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. 

మహిళా క్యాడెట్లు 60 మంది ఉండగా ఏటా 20 మంది కొత్తగా చేరుతున్నారు. భారత సైన్యంలో మొత్తంగా చూసినట్లయితే మెడికల్, డెంటల్‌ విభాగాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా అంటే సుమారు 21% ఉంది.

(చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్‌ రహస్యం ఇదే..)
 

Advertisement
 
Advertisement
Advertisement