ఓ గ్రామ నేపథ్యం నుంచి కార్పొరేట్ స్థాయి ఉద్యోగం చేయడమే స్ఫూర్తిదాయకం. అందులోనూ వైట్‌కాలర్ ఉద్యోగం అంటే చక్కగా హాయిగా ఏ మాత్రం శారీరక శ్రమ పడకుండా ఏసీ గదుల్లో కూర్చొని చేసే జాబ్. అలాంటి జాబ్‌ని వద్దనుకుని దేశ సేవలోకి రావడం మాటలు కాదు. పైగా ఆర్మీలో కఠినతరమైన శిక్షణను తట్టుకుని ఏకంగా ఆఫీసర్ స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది భూటాన్‌కి చెందిన అమ్మాయి. యువతరం అంటే ఎంజాయ్‌మెంట్‌కి, జోష్‌కి కేరాఫ్ కాదు..దేశ సేవలో మనము భాగం కావాలి..మన దేశ భవిష్యత్తుకు మనమే రూపకర్తలం అని చాటి చెప్పి..జయహో సృజన అని అనిపించుకుంది
ఆ అమ్మాయే విదేశాంగ అధికారి క్యాడెట్ సృజన ఘల్లీ. అసలు సాయుధ దళాల కుటుంబ నేపథ్యం కాకపోయినా..ఎప్పుడో చిన్నతనంలో ఒక సైనిక అధికారిని చూసి..మనం కూడా అలాంటి యూనిఫాం ధరిస్తే..అని సరదాగా అనుకుంది. అది ఆమె మనసు అంతరాళంలో ముద్రపడినా..పెద్దయ్యాక అంతగా దాన్ని పట్టించుకోలేదు సృజన. భూటాన్‌లోని సామ్ట్సే అనే గ్రామంలో పుట్టి పెరిగిన సృజన తన కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్నత విద్యవైపుగా అడుగులు వేసింది.
అలా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, భూటాన్‌లోని సెలిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలో మరిన్ని ఉన్నత హోదాల్లో పనిచేసే అవకాశం ఉన్నా..దాన్నికాదనుకుని చిన్నతనంలో ఇష్టపడ్డ ఆర్మీయూనిఫాంని ధరించేందుకు ఇష్టపడింది. సౌకర్యవంతమైన కార్పొరేట్ లైఫ్‌లో సంతోషం లేదని, వ్యక్తిగత సక్సెస్ కన్నా..దేశ సేవలో ఉన్న ఆనందమే వేరు అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది.
అలా ఆమె సాఫ్ట్‌వేర్ కెరీర్‌ని వదిలేసి సైనికురాలిగా సేవలందించాలని భావించి..చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్‌గా చేరింది. అక్కడ ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. తొమ్మిది నెలల కఠిన సైనిక శిక్షణలో ఆహోరాత్రలు శ్రమించింది. ఆ క్లిష్టతరమైన శిక్షణ శారీరకంగానూ మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉండేలా చేశాయి. కంఫర్ట్‌జోన్ దాటి వస్తేనే అసలైన మజా ఉంటుందని గ్రహించింది. ఆ సైనిక శిక్షణలో ఎదురైన కష్టాలు, సవాళ్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పించాయి.
ఒకరకంగా ఆ ట్రైనింగ్‌లోనే సంకల్పం, పట్టుదల, ఓర్పు విలువల గురించి మరింతగా తెలుసుకుంది. అలా సైనిక నాయకత్వ బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకుని రాయల్ భూటాన్ ఆర్మీలో కమిషన్డ్ సభ్యురాలి పనిచేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం సృజన దేశానికి ఒక కవచం, సురకత్తిలా మారనుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అలాగే కఠినతరమైన ఆర్మీ శిక్షణలో నెగ్గుకురావాలంటే..అచంచలమైన ఓపిక, ధైర్యం తోపాటు దేశభక్తి ఉండాలి. నిజంగా సృజనే శక్తిమంతమైన మహిళ. ఆదర్శవంతమైన నారీ కూడా.
(చదవండి: రణరంగంలో నారీ శక్తి..!)


