చీకటి – వెలుగులు | Women Sweeper Kanthi Rani life journey | Sakshi
Sakshi News home page

చీకటి – వెలుగులు

Mar 2 2026 5:56 AM | Updated on Mar 2 2026 5:56 AM

Women Sweeper Kanthi Rani life journey

మహిళా దినోత్సవ కథనాలు

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ‘నైట్‌ డ్యూటీ’ అనే మాట వింటూనే ఉంటాం. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లను ఊడ్చే మహిళా స్వీపర్లూ రాత్రిపూటే విధులను నిర్వర్తిస్తుంటారు.  సికింద్రాబాద్‌లోని రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌ పరిసరాలలో రాత్రి రెండు గంటల సమయంలో రోడ్లను ఊడుస్తూ కనిపించింది కంతి రాణి.  కాసేపు ఆమెతో మాట కలిపితే ఒంటిచేత్తో బతుకుబండిని ఎలా లాక్కొస్తుందో ఇలా మన ముందు ఆవిష్కరించింది..

‘‘కష్టాలు వచ్చాయని ఆగిపోతమా? చావో బతుకో తేల్చుకోవాలి. రాత్రిపూట రోడ్లమీద పని అంటే మాకు భయమే ఉంటుంది. కానీ, బతుకు భయం అంతకన్నా పెద్దది. అందుకే, ధైర్యంగానే ఈ పని చేస్తుంటాం. రాత్రి ఏడు గంటలకు డ్యూటీలో చేరితే, మళ్లా తెల్లారి ఐదున్నర అయితది డ్యూటీ దిగేసరికి. ఇంటికి చేరేసరికి ఏడు గంటలు. రాత్రంగా రోడ్లు ఊడ్చి ఊడ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాం. అందుకని, ముందుగా స్నానం చేసి, ఇంటి పనులు చేసుకొని, ఇంట్ల వాళ్లకు ఇంత వండిæపెట్టి, నేను తిని, పగటేల పన్నెండు గంటలకు పడుకుంట. మళ్లా సాయంకాలం ఐదు గంటలకు లేచి, పనులు చేసుకొని, ఏడు గంటలకు డ్యూటీకి పోత. పదహారేళ్లుగా ఇదే నా పని.. 

ఒంటి చేతి కష్టమే!
మా ఊరు జనగాం దగ్గర వెలిగొండ. చిన్నతనంలోనే మా అమ్మనాయన నాకు పెండ్లి చేశారు. మా అమ్మనాయనకు ముగ్గురు ఆడపిల్లలం, ఓ మగపిల్లాడు. నా భర్త పేరు జక్రయ్య. మా నాయిన సొంత అక్క కొడుకు. చిన్నప్పుడు బావిలో పడి, ఓ కాలు పనిచేయదు. ‘కాలు సరిగా పనిచేయని వాడిని ఎవరూ పెండ్లి చేసుకోరు’ అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు మా నాయిన. నా పెళ్లి నాటికి నాకు పదిహేనేండ్లు కూడా లేవు. ఊళ్లో కొన్నాళ్లు ఉన్నం. 

ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు. బతుకుదెరువు కష్టమైతే హైదరాబాద్‌ వచ్చినం. మొదట హౌజింగ్‌ బోర్డ్‌ ఏరియా లో ఉండేవాళ్లం. అక్కడే ఉప్పర్‌ పనికి పోయిన, ఇండ్లల్ల పనిచేసిన. మా ఆయన పనికెళితే, పడిపోయేటోడు. దీంతో నేనే ఆయన్ని ఇంట్లో ఉంచి, పిల్లలను స్కూల్‌కు పంపించి, పనికి పోయేదాన్ని. ఆ తర్వాత తెలిసినవాళ్ల ద్వారా స్వీపర్‌ పనిలో చేరిన. అప్పుడు యాప్రాల్‌లోని బాలాజీ నగర్‌కి వచ్చి, ఇల్లు తీసుకొని ఉన్నం. పిల్లలను పదోతరగతి వరకు చదివించిన. ఆ తర్వాత పెండ్లిండ్లు చేసిన. అన్నీ ఒంటి చేత్తోనే. 

కలిగిన దాంట్లో సాయం...
మా అక్కచెల్లెళ్ల లో ఒక చెల్లెలికి, భర్త చనిపోయి మస్తు కష్టపడుతుంది. తమ్మునికి ముగ్గురు ఆడపిల్లలు. తమ్ముడికి ఆరోగ్యం బాలేక చనిపోయాడు. దీంతో మా మరదలు పిల్లలను పెంచడానికి మా లెక్కనే కష్టపడుతుంటది. అందుకని నాకు కలిగినదాంట్లో వాళ్లకు సాయం చేస్తుంటాను. పిల్లల పెండ్లిండ్లకు అప్పు అయ్యింది, మెల్లగా తీర్చుకుంటున్న. 

పండగలొస్తే మహా కష్టం..
బోనాలు, వినాయక చవితి, జెండా పండగల సమయాలలో, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు .. చాలా పని ఉంటది. ఎంతంటే... మాపని ఘోరం అని చెప్పచ్చు. గుడుల దగ్గర, స్టేషన్, ట్యాంక్‌బండ్‌.. వేరే వేరే చోట్లల్లా డ్యూటీ ఉంటుంది. ఆ రోజుల్లో చెత్త చానా ఎక్కువ ఉంటుంది. ఊడ్చి ఊడ్చి చేయి రెక్కలు బాగా నొప్పి పెడతాయి. 

ప్రాణాలు అరచేతిలోనే..
యాక్సిడెంట్లు అవుతుంటాయి. అర్థరాత్రి దాటిందంటే ట్రాఫిక్‌ ఉండదు కదా! బండ్లు, వ్యానులు మస్తు స్పీడ్‌గా పోతుంటయి. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా, ఊడుస్తుండగా యాక్సిడెంట్లు అయినయి. మా గ్రూప్‌లోనే నలుగురైదుగురు చనిపోయారు. పానాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తుంటాం. ఇది కాకుండా తాగినోళ్లు ఉంటారు. తాగి, రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్లు ఉంటారు. వాళ్లను జరగమంటే.. ఆ మత్తులో గలీజు మాటలు అనేటోళ్లు ఉంటారు. తిడుతుంటరు. మీద మీదకు వస్తుంటరు. పోలీసులు ఉంటారు.

 కానీ, రోజూ వాళ్లకు ఎన్నని చెబుతం. అందుకే, అలాంటోళ్ల నుంచి దూరంగా ఉంటూ మా పని మేం చేసుకుంటూ పోతుంటం. బతుకుదెరువు కోసం తప్పదు, అన్నీ భరిస్తాం. మా గ్రూప్‌లో పదిహేను మంది దాకా ఉంటాం. అందరివీ సమస్యలే. నెలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అంతకు మించి ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతం కట్‌ అవుతది. నెలంతా ఊడ్చితే పదివేల రూపాయల దాకా వస్తాయి. అందులోనే అన్నీ సర్దుకుంటాం. ఇప్పుడంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. చిన్న చిన్న పిల్లలున్న తల్లుల కష్టం ఇంకా పెద్దది.

ఒకరికి ఒకరం... 
మా గ్రూప్‌ వాళ్లం కలిసినప్పుడు ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటాం. కానీ, ఎవరి కష్టాలు వారివే. ఊడ్చి ఊడ్చి మెడలు గుంజుతాయి. మళ్లీ ఇంటికొచ్చి పనులు చేసుకోవాలి. ఈ పనిలో చేరిన కొత్తలో చేతనైంత కాలం పని చేసుకోవచ్చు అన్నారు. కానీ, అరవై ఏళ్లు దాటినవాళ్లు పని నుంచి దిగిపోయారు. వాళ్లకు పెన్షన్‌ ఏమీ లేదు. కానీ, వాళ్ల ఇంట్ల బిడ్డకో, కొడుకుకో మళ్లీ స్వీపర్‌ పని ఇస్తరు’ అంటూ రాత్రిళ్లు రోడ్లు ఊడ్చే పనుల్లోని చీకట్లను, బతుకులో నింపుకుంటున్న వెలుగును పంచుకుంది రాణి. 

– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement