తరచుగా కళ్లను రుద్దితో..డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయా..? | Beauty And Health Tips: Is Rubbing Your Eyes Bad | Sakshi
Sakshi News home page

తరచుగా కళ్లను రుద్దితో..డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయా..?

Mar 1 2026 1:58 PM | Updated on Mar 1 2026 1:59 PM

Beauty And Health Tips: Is Rubbing Your Eyes Bad

నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఉద్యోగం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తోంది. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌తో పాటు స్వల్పంగా వాపు కూడా వస్తోంది. అలాగే నాకు అలర్జీ సమస్య ఉంది. తరచుగా కళ్లను రుద్దుకుంటూ ఉంటాను.
కవిత, విశాఖపట్నం

ఈ రోజుల్లో కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్, వాపు చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ అంటే ఆ భాగంలో చర్మం రంగు మారడం, నీడలా కనిపించడం లేదా లోతుగా కనిపించడం వల్ల ముఖం అలసినట్టు లేదా వయస్సు ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. ఇవి సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల వస్తాయి. 

మీ విషయంలో రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, మొబైల్, ఇతర స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వంటి జీవనశైలి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా అలర్జీ సమస్య ఉండటం, తరచుగా కళ్లను రుద్దుకోవడం కూడా డార్క్‌ సర్కిల్స్‌ను పెంచుతాయి. ముక్కు అలర్జీ లేదా సైనస్‌ సమస్యల వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మారి నీలం లేదా ఊదా రంగులో వలయాలు కనిపించవచ్చు. 

తరచు రుద్దుకోవడం వల్ల చర్మంలో మెలనిన్‌ పెరిగి గోధుమరంగు పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. కొందరిలో కుటుంబ చరిత్ర, చర్మం పలుచగా ఉండటం లేదా కళ్లు లోతుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజెన్‌ తగ్గి చర్మం వదులుగా మారుతుంది. దాంతో లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించి కళ్ల కింద నీలి ఛాయ పెరుగుతుంది.

కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ అన్నీ ఒకే రకంగా ఉండవు. కొందరిలో గోధుమరంగు పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చర్మం పలుచగా ఉండడం వల్ల నీలం లేదా ఊదా రంగు రక్తనాళాలు కనిపిస్తాయి. మరికొందరిలో కంటి కింద లోతు ఉండటం వల్ల నీడలా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొవ్వు నిల్వ కావడం వల్ల వాపు లేదా బ్యాగ్స్‌ రూపంలో కనిపిస్తుంది. చాలా మందిలో ఇవన్నీ కలిసిన రూపం ఉంటుంది. అందుకే సరైన చికిత్స కోసం ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవటం అవసరం. 

ఈ పరీక్షల్లో చర్మం రంగు, లోతు, వాపు, అలర్జీ లక్షణాలు వంటి అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే హీమోగ్లోబిన్, ఐరన్, విటమిన్‌ బి12, థైరాయిడ్‌ పరీక్షలు కూడా సూచిస్తాం. అయితే, చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయటం అవసరం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట అవసరం లేకుండా మేల్కొని ఉండకూడదు. కళ్లను రుద్దుకోవడం మానుకోవాలి. అలర్జీకి సరైన చికిత్స తీసుకోవాలి. చల్లని కంప్రెషన్‌ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యాహారం తీసుకోవడం వల్ల మంచి మెరుగుదల కనిపిస్తుంది. 

అయినప్పటికీ సమస్య ఎక్కువగా ఉంటే పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్సలు సూచిస్తాం. సన్‌స్క్రీన్, విటమిన్‌ సి, తక్కువ శక్తి గల రెటినాయిడ్‌ను రాత్రిపూట వాడటం, కొజిక్‌ లేదా అజెలాయిక్‌ ఆమ్లం వంటి పిగ్మెంటేషన్‌ తగ్గించే క్రీములు ఉపయోగించడం చేస్తాం. అవసరమైన సందర్భాల్లో కెమికల్‌ పీల్స్‌ చేస్తాం. లోతు ఎక్కువగా ఉన్నవారిలో హయాలురోనిక్‌ ఆమ్ల ఫిల్లర్లు లేదా పీఆర్‌పీ చికిత్స ఉపయోగపడుతుంది. 

పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ చికిత్సలు, రక్తనాళాలు స్పష్టంగా ఉంటే ప్రత్యేక లేజర్‌ విధానాలు, చర్మం వదులుగా ఉంటే చర్మాన్ని గట్టిపరచే చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు మాత్రమే పూర్తిగా సరిపోవు. స్టెరాయిడ్‌ కలిగిన ఫెయిర్‌నెస్‌ క్రీములను తప్పకుండా నివారించాలి. 

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ ఒకే ఒక్క వ్యాధి కాదు, అనేక కారణాల సంకేతం. పూర్తిగా మాయం కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోయినా, సరైన నిర్ధారణతో వ్యక్తిగతంగా అనుకూలమైన చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. 
డా. ఇందిర పవన్‌
ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌ 

(చదవండి: స్మార్ట్‌ ఫోన్‌లు వద్దు..ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే ముద్దు..!: పేరెంట్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement