తియ్యటి తేనె ఆరోగ్య సంరక్షణలోనే కాదు..అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలకంగా ఉంటుంది. ఈ తేనెతో చేసిన మాయిశ్చరైజర్లు, ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని ప్రశాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి అలాంటి తేనెను సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలంటే..
అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌తో ఫోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది.
మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మంపై ఉన్న ట్యాన్ తొలగి΄ోయి ముఖం కాంతిమంతమవుతుంది.
తేనెలో ఉండే యాంటీ–సెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక చెంచా తేనెలో అరచెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలున్న చోట రాసి, 10 నిమిషాల తరువాత కడిగేయాలి.
పెదవులు నల్లగా మారినా, పగిలినా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తేనె, చక్కెర కలిపి పెదవులపై నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి పెదవులను గులాబీ రంగులోకి మారుస్తుంది.
చెంచా తేనెతో పాలు లేదా పెరుగు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి ముఖచర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
(చదవండి: ఎసిడిటీని తగ్గించే యాలక్కాయ..! ఇలా తీసుకుంటే ఎంతో మేలు)


