కథాకళి: నల్లని వెన్నెల | Kathakali Funday Story | Sakshi
Sakshi News home page

కథాకళి: నల్లని వెన్నెల

Mar 1 2026 11:44 AM | Updated on Mar 1 2026 11:50 AM

Kathakali Funday Story

సన్నగా తెల్లగా ఉండే ఇరవై ఆరేళ్ళ సప్తపర్ణి ఎప్పుడూ తెల్ల నూలు చీరలే కడుతుంది. నల్లటి స్టికర్‌ బొట్టు పెట్టుకుంటుంది. ఆ రోజు ప్రభంజన్‌ లంచ్‌ అవర్‌లో తన బ్రేకప్‌ గురించి చెప్పాడు.‘‘బ్రేకప్, నల్లటి వెన్నెల. అవి రెండు రంగులూ కలిసి ఉంటాయి.’’‘‘అవును. మనిద్దరి బ్రేకప్‌లు ఒకే రోజు జరిగాయి!’’ ఆమె చెప్పింది.‘‘అమ్మ నన్ను పెళ్ళి చేసుకోమని పోరుతోంది. మీ అమ్మ కూడా నిన్ను పోరుతూండచ్చు. కలిసి ప్రయాణించినా, కలిసి ఉన్నా ఓ మనిషి గురించి ఇంకో మనిషి ఎక్కువగా అర్థం చేసుకోగలడు. మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. పాంజిమ్‌కి వెళ్దాం. అక్కడ ఒకరి ముందు మరొకరం లోదుస్తులని మాత్రం విప్పద్దు.’’ఆమె సరే అనడానికి కొన్ని రోజులు తీసుకుంది.సెలవులు రాగానే ఇద్దరూ ప్రయాణమయ్యారు. 

మాలాలోని ఏర్‌ బీఎన్‌బీకి చేరుకున్నాక, అతని ఐడీని చెక్‌ చేసి, స్టుడియోని హేండ్‌ ఓవర్‌ చేశారు. ఆమె మొహం కడుక్కోగానే పెర్క్‌లేటర్‌లో కాఫీ కలిపి ఇచ్చాడు. ఆమె స్నానం చేశాక చెప్పాడు.‘‘కూరగాయలు తెచ్చాను. ఇద్దరం కలిసి వంట చేద్దాం. నేను సాంబార్‌ మాస్టర్‌ని.’’సైట్‌ సీయింగ్‌ నుంచి తిరిగి వచ్చాక సోఫాలో కూర్చుని టీవీ ఆన్‌ చేశారు. అతను యూట్యూబ్‌లో రాజేష్‌ ఖన్నా ఇన్‌స్ట్రుమెంటల్‌ మెలోడీస్‌ పెట్టాడు. ‘ఓ మెరే దిల్‌ కె చెయిన్‌’... ‘రూప్‌ తెరా మస్తానా’...‘‘ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌...’’ కొద్దిసేపాగి చెప్పాడు.

ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఆమె మెళ్ళోని బంగారు గొలుసుతో ఆడుకోసాగాడు. ఆ ఆడియో అయ్యాక ‘జెంటిల్‌మేన్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ పెట్టి, ఆమె పొత్తి కడుపుకి తలని ఆనించి, ఆమె నడుం చుట్టూ చేతులు వేసి చెప్పాడు.‘‘బద్ధకపు బ్రహ్మ! నేను పుట్టిన రోజే నువ్వు మా పక్కింట్లో పుడితే, ఇంతకాలం నిన్ను మిస్‌ అయ్యేవాడిని కానుగా.’’ఇద్దరూ రాత్రి ‘ఎయిటీన్‌ జూన్‌’లోని ‘యాంగ్రీ సర్దార్జీ’ హోటల్‌లో భోజనం చేశారు. తను వంట ఎందుకు నేర్చుకుంది, ఏడాది పెద్దయిన అన్నయ్యతో సమష్టిగా నీవి, నావి అనే తేడా లేకుండా బట్టలు వాడటం... చాలా చెప్పాడు. ఆ రాత్రి ఆపిల్‌ని నిలువు ముక్కలు కోసి ఆమె నోటికి అందించాడు.

‘‘నువ్వు నాకు కావాలి డకీ.’’ మంచం మీద చేరాక చెప్పాడు.అతను కుడిచేతి చూపుడువేలితో ఆమె జుట్టుని, కనుబొమలని, కళ్ళని, చెంపలని, ముక్కుని, చెవుల్ని, చిటికెన వేలుతో చెవుల్లోని భాగాన్ని, గడ్డాన్ని మృదువుగా మిల్లీమీటర్‌ మిస్‌ అవకుండా స్పర్శించాక అడిగాడు.‘‘నోరు తెరు.’’ ఆమె తెరిస్తే, వేలితో నాలికని, నాలిక కింద భాగాన్ని, దవడ లోపలి, పై భాగాన్ని స్పర్శించాక, ఆమె చేతుల్ని, చేతివేళ్ళ మధ్య భాగాన్ని, మెడ, నడుము, కాలి వేళ్ళ మధ్యని... అరిపాదాల దాకా స్పర్శిస్తూంటే ఆమె దాన్ని అనుభవించింది. వేలిని తన నాలికతో నాకి చెప్పాడు.‘‘చేదనేదే లేదు. అంతా తీపే. ఓ చోట చక్కెర, ఇంకోచోట తేనే, మరోచోట మకరందం. చిన్నప్పుడు పూలని కోసి కాడని నోట్లో ఉంచుకుని తాగిన మకరందం.’’ఆ రాత్రి సప్తపర్ణి తన బాల్యం గురించి చెప్పింది. ఆమె కాసేపటికి అటు తిరగగానే చెప్పాడు.

‘‘ఇటు తిరుగు డకీ. నువ్వు అటువైపు తిరిగితే నాకు దూరమయ్యావు అనిపిస్తోంది.’’ఆమె మళ్ళీ అతనివైపు తిరిగాక, ఆమె నడుము మీద చేతిని, ఆమె కాలు మీద తన కాలుని వేసి, కళ్ళు మూసుకుని చెప్పాడు.‘‘ఇప్పుడు ఎంతో భద్రంగా ఫీల్‌ అవుతున్నాను.’’ఒకవైపే తిరిగి పడుకోవటం అసౌకర్యంగా ఉండటంతో అతను నిద్రపోయాక, అతని నుదుటి మీద చుంబించి, అవతలివైపుకి తిరిగి పడుకుంది. ‘డకీ’ అంటే ‘ప్రియమైన, ముద్దుల’ అని గూగుల్‌ చేసి తెలుసుకుంది.‘‘ఇది నీ మొహానికి నప్పుతుంది. బ్లాక్‌ స్టికర్‌ బాలేదు.’’ప్రభంజన్‌ మర్నాడు ఎడమ చేత్తో ఆమె చుబుకం పట్టుకొని, తనతో తెచ్చిన సింగార్‌ ఎర్ర తిలకం ట్యూబ్‌లోంచి పుల్లని తీసి, చిన్న పిల్లలు కదలకుండా అటెన్షన్‌ కోసం ‘ళో, ళో, ళో’ అన్నట్లుగా అంటూ ధనియం గింజంత బొట్టుని దిద్ది జుట్టుని దువ్వాడు.

లంచ్‌లో కేబిన్‌లో ్రౖఫై డ్‌ రైస్, మష్రూమ్‌ కర్రీని ఆమెకి స్పూన్‌తో తినిపించాడు. ఆమె మనసు తడైంది. తన తాత తర్వాత మొక్కజొన్న గింజలని వొలిచి ఇచ్చింది, జడవేసింది, బొట్టు పెట్టింది, నోటికి తినిపించింది ఇతనే అనుకుంది.ఆ మూడు రోజులు అతను తన స్పర్శని వదలలేకపోవడం గుర్తించింది. ఇంట్లో జుట్టు కొసలని నిమురుతూ, భుజానికి తన తలని ఆనించి, తన నడుం చుట్టూ, లేదా భుజం మీద చేతిని వేసి, బయట చేతిని పట్టుకునే ఉంటాడు.ఆ రాత్రి మెలకువ వచ్చిన ప్రభంజన్‌ చేత్తో తడిమితే ఆమె ఒళ్ళు తగల్లేదు. కళ్ళు తెరిచి చూస్తే, కాళ్ళు మడిచి, మోకాళ్ళల్లో తల ఉంచుకొని ఏదో ఆలోచించే ఆమె కనిపించింది. అతను నిద్రమత్తులో ఆమె తలని తన ఛాతీ మీదకి జరిపి ‘పడుకో’ అని ఆమె వీపు మీద చిచ్చి కొడుతూ నిద్రపోయాడు.

రైలు కాచిగూడ స్టేషన్‌కి చేరుకోడానికి ముందు సప్తపర్ణి అతనితో చెప్పింది.‘‘ప్రభూ. ఈ మూడు రోజుల్లో నన్ను నేను తెలుసుకున్నాను. ఈ మూడు రోజులూ నీ ప్రేమని అనుభవిస్తూంటే నా మనసు ఉక్కిరిబిక్కిరైంది. నీలో మా తాతని, ప్రేమికుడిని, తల్లి దూరమైపోతుందని భయపడే పిల్లవాడిని చూశాను. నిన్ను కోల్పోతే, తాతని కోల్పోయి నేను అనుభవించిన క్షోభకి ఎన్నో రెట్లు... అది తట్టుకోలేను. సామాన్య ప్రేమని తప్ప నువ్విచ్చిన లాంటి ప్రేమని కోల్పోవడం తట్టుకో... నన్ను నీలా ఎవరూ ప్రేమించలేరు. మనం పెళ్ళి చేసుకోవద్దు.’’అతను ఆమెవైపు విభ్రాంతిగా చూశాడు. ఇద్దరూ ఒకరి కన్నీటిని మరొకరు తుడిచారు. స్టేషన్‌లోంచి బయటికి వచ్చాక, చెరో ఆటో ఎక్కేముందు ప్రభంజన్‌ ఆమె చేతిలో ఎర్ర తిలకం ట్యూబ్‌ని ఉంచాడు. 
 ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement