అల్లాడిపోతున్న పశ్చిమాసియా
వెనక్కు తగ్గని ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్
భారీగా సాగుతున్న దాడులు, ప్రతి దాడులు
కనుచూపు మేరల్లో కనిపించని ముగింపు
ఇరాన్‌కు ఇప్పటికే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం
పౌర, సైనిక నాయకత్వాన్నీ కోల్పోయిన వైనం
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకూ భారీగా నష్టాలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి ఏడు రోజులు పూర్తయ్యాయి. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలోని పలు ఇతర దేశాలు కూడా దాడుల బారిన పడుతున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా సరుకు రవాణా పడకేయడంతో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్‌లో కనీసం 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్‌లో పదుల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇరాన్‌పై దాడులను కనీసం మరో రెండు వారాలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్, నాలుగైదు వారాలు పట్టొచ్చని అమెరికా చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక హెజ్బొల్లా గ్రూపు వంటివాటి రంగప్రవేశంతో రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింతగా విస్తరిస్తూ వస్తోంది. పశ్చిమాసియా కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా దీర్ఘకాలం పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు యుద్ధం ఎలా సాగిందో చూస్తే...
ఒకటో రోజు
ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఫిబ్రవరి 28న శనివారం ఇరాన్‌పై భారీ స్థాయి యుద్ధానికి దిగాయి. బరిలోకి దిగుతూనే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయడం ద్వారా ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాయి! ఆయన నివాస, కార్యాలయ ప్రాంగణంలో అత్యున్నత స్థాయి రక్షణ భేటీ జరుగుతుండగా పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఏకంగా 30కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దనే ఉద్దేశంతో అత్యంత శక్తిమంతమైన బ్లూ స్పారో క్షిపణిని కూడా ప్రయోగించినట్టు తాజాగా తేలింది! ఖమేనీ భార్య, కోడలుతో పాటు కనీసం 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, సైనిక కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారు. ఆ వెంటనే ఇరాన్ అణు, సైనిక, క్షిపణి లంచ్ ప్యాడ్ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా 100కు పైగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ భవనాలు, అధ్యక్ష భవనంతో పాటు రాజధాని టెహ్రాన్‌వ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిసింది. ఓ స్కూలుపై జరిగిన దాడిలో 165 మందికి పైగా విద్యారి్థనులు దుర్మరణం పాలయ్యారు. అనూహ్య దాడి నుంచి తేరుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడికి దిగింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యం చేసుకుంటూ యూఏఈ మొదలుకుని దోహా దాకా పలు దేశాలపై దాడులు చేయడంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిగా మారింది.
రెండో రోజు
ఇరాన్‌కు చెందిన తొమ్మిది యుద్ధ నౌకలను అమెరికా ముంచేయడంతో యుద్ధం మరింతగా విస్తరించింది. అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దాడులు నేలమట్టం చేశాయి. ఇరాన్‌వ్యాప్తంగా 100కు పైగా నగరాలపైకి దాడులు విస్తరించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం నమోదయ్యాయి. ఇరాన్ దాడుల్లో అమెరికాకు కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కువైట్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని బేట్ షెమెష్ నగరంలోనూ 9 మంది మృత్యువాత పడ్డారు.
మూడో రోజు
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దులపైకి క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం లెబనాన్‌కు కూడా విస్తరించింది. అక్కడి హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాంతో ఒక్క బీరూట్‌లోనే 31 మందికి పైగా మరణించారు. దేశమంతటా మృతుల సంఖ్య 50 దాటింది. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది! డ్రోన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీపై స్వల్పంగా దెబ్బ తింది. దాంతో ఆ క్షేత్రాన్ని సౌదీ మూసేసింది. కువైట్ ఫైటర్ జెట్ జరిపిన ‘ఫ్రెండ్లీ ఫైర్’లో అమెరికా ఏకంగా మూడు యుద్ధవిమానాలను కోల్పోయింది! వాటిలోని పైలట్లు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. వాటిని కూలి్చంది తమ యుద్ధ విమానాలేనని ఇరాన్ చెప్పుకొచ్చింది.
నాలుగో రోజు
ఇరాన్‌పై దాడులను అమెరికా తీవ్రతరం చేసింది. సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై బీ–2 బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులను తీవ్రతరం చేసింది. కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. దానిగుండా ప్రయాణించే నౌకలకు నిప్పు పెడతానని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా సౌదీ రాజధాని రియాద్‌తో పాటు కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో వాటిని మూసేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దోహా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ పెద్దపెట్టున దాడులు జరిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భూతల పోరుకు దిగింది! 80 సరిహద్దు గ్రామాల వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది.
ఐదో రోజు
యుద్ధం టర్కీ దాకా విస్తరించింది. ఆ దేశంపైకి ఇరాన్ ఏకంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. భారత్‌తో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్‌కు చెందిన భారీ యుద్ధ నౌక ఐఆర్‌ఐఎస్ దేనాపై శ్రీలంక తీర సమీపంలో అమెరికా దాడి చేసింది. మార్క్–48 టోర్పెడో ప్రయోగించి దాన్ని ముంచేసింది. నౌకలోని 120 మందిలో 87 మంది మరణించారు. గల్ఫ్‌లోని తమ స్థావరాలను కాపాడుకునేందుకు పలు యూరప్ దేశాలు కూడా ఆయుధ వ్యవస్థలను మోహరించాయి.
ఆరో రోజు
టెహ్రాన్ గగనతలంలో ఇరాన్ సుఖోయ్–35 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెలీ ఎఫ్–35 ఫైటర్ జెట్ నేలకూల్చింది. ఇరాన్‌లో 170కి పైగా నగరాలు దాడులకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,230 దాటింది. తమ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా చమురు నౌకపై డ్రోన్లు, బోట్లతో దాడికి దిగింది. కువైట్, ఇరాక్‌ల్లో కూడా మరో రెండు చమురు నౌకలను నష్టపరిచింది. దాడులు అజర్‌బైజాన్‌కు కూడా విస్తరించాయి. ఇరాన్ డ్రోన్ల దాడిలో అక్కడి నఖ్‌చివాన్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది.
ఏడో రోజు
ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్‌ను అమెరికా, మధ్య, పశ్చిమ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేశాయి. లెబనాన్‌పై కూడా దాడులను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. టెల్ అవీవ్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది.
పశ్చిమాసియా, పరసర ప్రాంతాల్లో ఇప్పటికే 14 దేశాలు యుద్ధంతో ప్రభావితమవుతున్నాయి.
ఎన్నెన్ని సమస్యలో!
యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్‌పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హార్మూజ్ గుండా భారత్‌కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు.
ఏం జరగనుంది?
యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. అయితే రెండు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్



