రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్‌పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లోని దేవోబంద్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల ప్రకారం.. గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్‌పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్‌పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.
A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.
Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026
అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.
అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


