మా అక్కయ్య వాళ్ళ బాబుకు 12 సంవత్సరాలు. అన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంటాడు. బొత్తిగా లోకజ్ఞానం లేదు. చూడటానికి కూడా చాలా అమాయకంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మొహంలో కూడా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. అయితే ఆ బాబుకు ఎలా వచ్చిందో కాని, సంగీతంలో చాలా మంచి నైపుణ్యం వచ్చింది. రకరకాల రాగాలు పలికిస్తుంటాడు, పాడుతూ ఉంటాడు. టి.వి.లో, రేడియోలో సంగీత కార్యక్రమాలంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటాడు.
వీడి టాలెంట్ చూసి మాకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసులు వారి కచేరీలకు వీడిని కూడా తీసుకుని తమ బృందంలో ఒక సభ్యుడిగా పెట్టుకుంటున్నారు. చదువులో పైకి రాలేదు కాని, ఇలా సంగీత వేదికల మీద పేరు తెచ్చుకుంటున్నాడు. అన్నింటిలో వెనుకబడిన మా బాబుకు ఇలాంటి సంగీత నైపుణ్యం ఎలా అబ్బిందో అర్థం కావడం లేదు! వీడి భవిష్యత్తును ఎలా మలచాలో తెలియక ఆందోళనలో ఉన్నాము. మీరే మంచి సలహా చెప్పగలరు.
– రమణి, శ్రీకాకుళం
రమణి గారూ! మానసిక శాస్త్రంలో చాలా అరుదైన ఒక విషయాన్ని బయట పెట్టినందుకు, మీకు నా ధన్యవాదాలు. ఇడియాట్ సావంట్ (IDIOT SAVANT) అనే అత్యంత అరుదైన, వ్యక్తులు కొందరు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతారు. మీ అబ్బాయి కూడా ఈ కోవకు చెందినవాడే. బుద్ధిలో, లోకజ్ఞానంలో, చదువులో, లౌకిక విషయాల్లో మానవ సంబంధాల విషయాల్లో వీరు బాగా వెనుకబడే ఉంటారు. అయితే ఇలా ఏదో ఒక ప్రత్యేక విషయంలో, మిగిలిన వారికంటే చాలా ఎక్కువ నైపుణ్యం కలవారై ఉంటారు. ఇలాంటి పిల్లలలో కొందరు గణితంలో అద్భుత ప్రజ్ఞ ప్రదర్శిస్తే, మరికొందరు చిత్రకళలో, కొందరు సంగీతంలో మీ బాబు లాగా, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఎవ్వరూ ఊహించలేనంత నైపుణ్యం ప్రదర్శిస్తారు.
వీరి మెదడు పూర్తిగా వృద్ధి చెందక పోయినా, ఏదో ఒక భాగం, మామూలు కంటే అతి తక్కువగా వృద్ధి చెంది, ఆయా మెదడు భాగాల పనితీరునుబట్టి, అటు గణితం, సంగీతం, చిత్రలేఖనం, ఇలాంటి విషయాల్లో అత్యద్భుతమైన నైపుణ్యం కలిగేటట్లు చేస్తుంది. చరిత్రలో కిమ్ పీక్ (జ్ఞాపక శక్తి) స్టీఫెన్ విల్ట్ షైర్ (చిత్రలేఖనం), దెరెక్ (సంగీతం) లాంటి వీరు ఈ కోవకు చెందినవారే! ‘ఆటిజమ్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన పిల్లలలో ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కనపడే అవకాశముంది.
ఇటీవలే ‘ఇడియాటిక్ సావంట్’ పేరు అభ్యంతరకరంగా ఉందని, దీనిని ‘సావంట్ సిండ్రోమ్’గా (savant syndrome) పేరు మార్చారు. ఇకపోతే, బతుకుదెరువుకు, జీవితంలో పైకి రావడానికి కేవలం చదువొక్కటే ముఖ్యం కాదు. సమాజంలో చదువు తక్కువైన చాలామంది ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నారో మనకు తెలిసిందే! మీ అక్కయ్య వాళ్లను అధైర్యపడ వద్దని చెప్పండి. ఆ బాబును, తననకు అబ్బిన సంగీతం విషయంలోనే, మరింత శిక్షణ ఇప్పిస్తే, అతడు భవిష్యత్తులో మంచిపేరు తీసుకురాగలడని నా నమ్మకం! ఆల్ ది బెస్ట్!
- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


