సింకోప్‌.. ప‌డి లేచే ప్ర‌మాదం | Syncope Symptoms, Causes and Treatment; Here's Full Details | Sakshi
Sakshi News home page

Syncope: ప‌డి లేచే ప్ర‌మాదం

Feb 17 2026 7:44 PM | Updated on Feb 17 2026 7:51 PM

Syncope Symptoms, Causes and Treatment; Here's Full Details

ఫెయింట్‌ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్‌’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్‌గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్‌) మొదలుకొని వేగస్‌ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్‌’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.

కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్‌)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్‌ను సింకోప్‌ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్‌ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.

సింకోప్‌లో రకాలు
న్యూరల్లీ మీడియేటెడ్‌ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల.  సింకోప్‌ కండిషన్‌ రావచ్చు. 
ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్‌ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్‌ప్రెషర్‌) తగ్గిపోవడం వల్ల. 
కార్డియాక్‌ సింకోప్‌ : గుండె రిథమ్‌లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్‌లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు.  

సిచ్చువేషనల్‌ సింకోప్‌ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.

సింకోప్‌ కారణమయ్యే మెకానిజమ్‌ 
1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.

2) గుండె పంపింగ్‌ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన  బ్లడ్‌ప్రెషర్‌ను మెయిన్‌టెయిన్‌ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం  లేకపోవడం.

3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.

ఎందుకిలా జరుగుతుందంటే... 
గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్‌ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్‌ఏ నోడ్‌ (సైనో ఏట్రియల్‌ నోడ్‌) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు.  కార్డియాక్‌ సింకోప్‌లో ఇలా జరుగుతుంది.

వేగం పెరిగితే... 
కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్‌ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్‌ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్‌ ఏ వయసు వారికైనా రావచ్చు.

వేగం తగ్గితే... 
గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్‌ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్‌ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్‌ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్‌ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.

సింకోప్‌కు కారణాలు
గుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్‌ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్‌లో సింకోప్‌ రావచ్చు.

గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్‌’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్‌ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్‌సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్‌’ అంటారు. ఈ కండిషన్స్‌లో దేనివల్లనైనా సింకోప్‌ రావచ్చు.

మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్‌ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్‌ ఏర్పడే అవకాశముంది.

పోష్చురల్‌ హైపోటెన్షన్‌ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు  తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్‌ హైపోటెన్షన్‌’  అంటారు.

వేసోవేగల్‌ సింకోప్‌ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్‌’ కండిషన్‌  వస్తుంది. వేగస్‌ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్‌ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్‌ సింకోప్‌ అంటారు.

తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్‌ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్‌ స్ట్రెస్‌) కూడా వేగస్‌ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.

పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్‌ మూవ్‌మెంట్స్‌), విపరీతంగా తగ్గడం కూడా వేగస్‌ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా  సింకోప్‌ కండిషన్‌ వస్తుంది.

అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...
కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్‌ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్‌ కండిషన్‌కు దారితీస్తుంది.

రక్తహీనత.. 
అనీమియా అనే రక్తహీనత కండిషన్‌ కూడా సింకోప్‌కు కారణం. అనిమియా కండిషన్‌లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో కూడా సింకోప్‌ రావచ్చు. 

శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం   (డీ–హైడ్రేషన్‌) వల్ల కూడా సింకోప్‌ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్‌ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్‌కు లోనుకావచ్చు. 
ఈ కండిషన్లు కొందరిలో సింకోప్‌కు దారితీసేందుకు అవకాశముంది.  

చికిత్స
సింకోప్‌ అన్న కండిషన్‌ నిజానికి అంత సీరియస్‌ కాదు. కానీ ఇలా ఫెయింట్‌ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్‌ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్‌లైయింగ్‌ కాజెస్‌) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత  డాక్టర్‌ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్‌లైయింగ్‌ కాజెస్‌తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి.  

సింకోప్‌ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్‌కు (టెరిషియరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు) తరలించాల్సి ఉంటుంది.

గుండె స్పందనల లయ (రిథమ్‌)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్‌ మేకర్‌ అమర్చాల్సి   రావచ్చు. ఈ పేస్‌మేకర్‌ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్‌ మేకర్‌ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్‌గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్‌లో ఒక షాక్‌ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్‌ అయ్యేలా చూడటం; అలాగే ఇది  గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.

చ‌ద‌వండి: గుండె జ‌బ్బుల రిస్క్ ఎవ‌రికి ఎక్కువ‌?

ఈ పనులన్నింటినీ పేస్‌ మేకర్‌ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్‌ రీ–సింక్రనైజేషన్‌ థెరపీ’ (సీఆర్‌టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్‌ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్‌మేకర్‌ అమర్చాక పేషెంట్స్‌ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్‌గానే చేసుకోవచ్చు.

తక్షణం అందించాల్సిన సపర్యలు

∙సింకోప్‌కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్‌డ్‌గా కూర్చోబెట్టాలి.

∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్‌) వల్ల  సింకోప్‌ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.

నివారణ : నిజానికి సింకోప్‌కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... 
వేసోవేగల్‌ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్‌లను నివారించవచ్చు. 

అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్‌ హైపోటెన్షన్‌ సింకోప్‌ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్‌ రాకుండా చూసుకోవచ్చు. 

ఇది డీ హైడ్రేషన్‌ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్‌ను నివారించవచ్చు.

చివరగా...
ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్‌ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్‌ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.

నిర్వహణ: యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement