స్పానిష్ రైలు ప్రమాదంలో శునకం అదృశ్యం..
నా ప్రాణమైన ‘బోరో’ఎక్కడ?’.. ఒక యజమాని కన్నీటి నిరీక్షణ
ఒకవైపు మృతదేహాల గుట్టలు.. మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఆదివారం రాత్రి స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు.. 150 మందికి పైగా రక్తగాయాలయ్యాయి. కానీ, ఆ రక్త ధారల మధ్య ఒక యువతి కన్నీటి రోదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుండెలను పిండేస్తోంది. ఆమె అడుగుతోంది తన ప్రాణాల కోసం కాదు.. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్న శునకం ‘బోరో’గురించి..
క్షణంలో మారిన దృశ్యం
అనా గార్సియా తన గర్భిణి సోదరితో కలిసి ఆదివారం సాయంత్రం మాలాగా నుంచి మాడ్రిడ్‌కు హైస్పీడ్ రైలులో వెళ్తోంది. రాత్రి 7.45 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో బోగీలు తునాతునకలయ్యాయి. కిటికీల గుండా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న భీభత్స దృశ్యాలు.. ఆ గందరగోళంలో, అనా గార్సియా కళ్లముందే తన శునకం బోరో భయంతో పారిపోవడం చూసింది.
నా ప్రాణాన్ని తెచి్చవ్వండి
శరీరమంతా గాయాలు, బుగ్గపై బ్యాండేజ్, కళ్లలో నీళ్లు.. నడవడానికి కూడా శక్తి లేక కుంటుతున్నా అనా గార్సియా మీడియా ముందుకు వచ్చి ఒకటే విజ్ఞప్తి చేసింది.. ‘దయచేసి ఆ మూగజీవాలను వెతకడానికి సహాయం చేయండి. బోరో కేవలం కుక్క కాదు.. మా కుటుంబ సభ్యుడు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి’.. అంటూ ప్రాధేయపడింది.
ప్రపంచాన్ని కదిలించిన ఫొటో
కుంటుతూనే తన ప్రాణ స్నేహితుడి కోసం ఆమె మళ్లీ ప్రమాద స్థలికి బయల్దేరిన తీరు చూసి స్పెయిన్ మొత్తం కదిలింది. నల్లటి రంగు, తెల్లటి కను»ొమ్మలతో ఉన్న బోరో ఫొటో నిమిషాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. వేలాది మంది నెటిజన్లు ఫోన్ నంబర్లను షేర్ చేస్తూ బోరో కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఇలా కనిపించి.. అదృశ్యం
సోమవారం మధ్యాహ్నం టీవీ చానల్ (టీవీఈ) ప్రమాద స్థలాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక ఆశ చిగురించింది. పొలాల్లో బోరోను పోలిన ఒక కుక్క పరుగెడుతూ కెమెరాకు చిక్కింది. కానీ, అది ఇన్వెస్టిగేషన్ జోన్ కావడంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోయారు. ఆ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది, ప్రమాదం జరిగిన ప్రాంతం దర్యాప్తు సంస్థల ఆ«దీనంలో ఉండటంతో సాధారణ ప్రజలకు ప్రవేశం లేదు. అయితే, బోరో కోసం స్పెయిన్ జంతు హక్కుల పార్టీ ప్రత్యేక అనుమతి పొందింది. ప్రభుత్వ అనుమతితో జంతు సహాయక బృందాలు బుధవారం రంగంలోకి దిగాయి. ‘మేము బోరోను వెతికి తీరుతాం.. ఆ కుటుంబానికి మళ్లీ ఆనందాన్ని ఇస్తాం’.. అని యానిమల్ రైట్స్ పార్టీ ప్రకటించింది.
బోరో.. క్షేమంగా తిరిగి రా!
చనిపోయిన 42 మంది కుటుంబాల్లో విషాదం ఒకవైపు తాండవిస్తుంటే.. ప్రాణాలతో బయటపడి కూడా తన ప్రియమైన మూగజీవం కోసం ఎదురుచూస్తున్న అనా గార్సియా పోరాటం ఇప్పుడు స్పెయిన్ అంతటా ఉత్కంఠకు గురిచేస్తోంది. బోరో దొరుకుతుందా? అనా తన ప్రాణ స్నేహితుడిని మళ్లీ హత్తుకుంటుందా?.. బోరో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.
– సాక్షి, నేషనల్ డెస్క్


