‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా’’.. ఇటీవలి కాలంలో ప్రేమికులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలోని పంక్తులు అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్- ఇటలీ నటుడు ఆండ్రియా ప్రెటీకి సరిగ్గా సరిపోతాయి.
వేర్వేరు దేశాలకు చెందిన వీనస్- ఆండ్రియా రంగాలూ, పైకి కనిపించే సోకాల్డ్ ‘రంగు’లూ భిన్నమైనవే. సంపాదనలోనూ భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా. వయసులోనూ ఎనిమిదేళ్ల వ్యత్యాసం. అయితేనేం వారి హృదయాంతరాల్లో ఉన్న స్వచ్చమైన ప్రేమకు ఈ అంతరాలు అడ్డంకి కాలేదు. ఏడాదిన్నర కాలంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది.
ఇటలీలో ఈ సెప్టెంబరులోనే వీనస్- ఆండ్రియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీనస్ విదేశీయురాలు కాబట్టి ఈ వివాహం అధికార ముద్ర పొందేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. అందుకే తాజాగా తన స్వస్థలం ఫ్లోరిడాలోని బీచ్‌లో వీనస్ మరోసారి తన భర్తతో పెళ్లినాటి ప్రమాణాలు చేసింది.

ఇంతకీ ఈ ఆండ్రియా ప్రెటీ ఎవరు?
డానిష్ సంతతికి చెందిన ఆండ్రియా ఇటలీలో పెరిగాడు.మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతన్నాడు. సినిమాలు, టీవీ షోలు, రియాల్టీ షోలతో బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఆండ్రియా.. విలక్షణ రీతిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.
చక్కటి అందగాడు మాత్రమే కాదు.. నిరాడంబరంగా జీవించేందుకే ఆండ్రియా ఇష్టపడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. వీనస్‌తో డేటింగ్ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే ఆమె కుటుంబంతో చక్కగా కలిసిపోయాడు ఆండ్రియా.
ప్రేమకథ అలా మొదలైంది
కెరీర్‌కు ప్రాధాన్యం ఇచ్చే వీనస్ విలియమ్స్ నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తలేదు. స్వాతంత్ర్యంగా జీవించేందుకు ఇష్టపడే వీనస్... గతేడాది వరకూ సింగిలే. అయితే, 2024లో మిలాన్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్.. ఆమె జీవితంలోని నవ వసంతానికి నాంది పలికింది.
అక్కడే తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటీ తొలి చూపులోనే వీనస్ దృష్టిని ఆకర్షించాడు. అతడిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మాటలు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. స్నేహం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది.

ఎవరి నెట్‌వర్త్ ఎంత?
మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న వీనస్ విలియమ్స్.. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కలిపి మరో పదహారు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వాషింగ్టన్ డీసీ ఓపెన్‌లో గెలిచిన 45 ఏళ్ల వీనస్.. ఈ టైటిల్ గెలుచుకున్న రెండో అతిపెద్ద వయస్కురాలిగా చరిత్రకెక్కింది.
చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకుని దిగ్గజంగా ఎదిగిన వీనస్ విలియమ్స్.. ఇటు టెన్నిస్ టైటిళ్ల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ.. అటు ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీ మొత్తమే కూడబెట్టింది. అంతేకాదు ఇంటీరియర్ రంగంలో అడుగుపెట్టిన వీనస్‌కు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.

వంద రెట్లు ఎక్కువ
ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వీనస్ విలియమ్స్ నికర ఆస్తుల విలువ తొంభై ఐదు మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు 851 కోట్ల రూపాయలకు పైమాటే.
మరోవైపు.. వీనస్ భర్త ఆండ్రియా ప్రెటీ.. మోడలింగ్, నటన, సినిమా ప్రొడక్షన్ ద్వారా సుమారుగా 1- 2 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు అంచనా (భారత కరెన్సీలో దాదాపు రూ. 8- 17 కోట్లు). దీనర్థం భర్త కంటే వీనస్ ఆస్తుల విలువ రమారమి వంద రెట్లు ఎక్కువ. అందుకే మరి అనేది.. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా!!


