డేవిడ్ బెక్‌హామ్.. ఈ పేరకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన ఈ మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పారిస్ సెయింట్- జెర్మేన్.. ఇలాంటి ప్రతిష్టాత్మక జట్టకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్.. మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.
పాతికేళ్ల కాపురం
ఇక వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్ బెక్‌హామ్ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీమేన్‌గా కొనసాగుతున్నాడు. మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్‌తో ప్రేమలో పడ్డ డేవిడ్ బెక్‌హామ్.. 1999లో ఆమెను పెళ్లాడాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గల లట్రెల్స్‌టౌన్‌లో అత్యంత వైభవోపేతంగా వీరి వివాహం జరిగింది.

ఇప్పటికి పాతికేళ్లకు పైగా వైవాహిక బంధంలో కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్న డేవిడ్- విక్టోరియా జంటకు.. నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్‌హామ్, రోమియో బెక్‌హామ్, క్రూజ్ బెక్‌హామ్.. కుమార్తె హార్పర్ సెవెన్ బెక్‌హామ్. 26 ఏళ్ల బ్రూక్లిన్ ఫొటోగ్రాఫర్, మోడల్, చెఫ్.
ఇక 2002లో జన్మించిన రోమియో ఫుట్‌బాలర్‌గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. ఇరవై ఏళ్ల క్రూజ్ తల్లి మాదిరి సంగీత రంగంలో ఉన్నాడు. పద్నాలుగేళ్ల హార్పర్ పాఠశాల విద్య ఇంకా పూర్తి కాలేదు. కాగా పెళ్లైన తర్వాత విక్టోరియా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ కొనసాగిస్తోంది.
పెద్ద కుమారుడి వివాహం.. కోడలి రాకతో
అమెరికా బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు బ్రూక్లిన్. అప్పటి నుంచే తల్లిదండ్రులతో అతడికి విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
పెళ్లిలో వేసుకునేందుకు విక్టోరియా.. కోడలు నికోలా కోసం గౌన్ డిజైన్ చేయగా.. ఆమె దానిని ధరించేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి నికోలా స్పందిస్తూ.. విక్టోరియా డిజైన్ చేసిన డ్రెస్ తనకు సరిపడలేదని అందుకే వేరే గౌను వేసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చింది.

అన్‌ఫాలో చేశాడు
అయినప్పటికీ అత్తా-కోడలి మధ్య గొడవ అన్న వదంతికి చెక్‌పడలేదు. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం బ్రూక్లిన్ తన తల్లిదండ్రులతో విడిపోయేదాకా చేరిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా.. తన తల్లిదండ్రులను బ్రూక్లిన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు ఇందుకు కారణం.
తండ్రి పుట్టినరోజున రాలేదు.. మామకు విషెస్
అంతేకాదు గత కొంతకాలంగా బ్రూక్లిన్.. డేవిడ్- విక్టోరియాలతో పాటు తన తమ్ముళ్లు, చెల్లెలికి కూడా దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి చేసుకునే వేడుకలక అతడు గైర్హాజరు అవుతున్నాడు. డేవిడ్ బెక్‌హామ్ ఇటీవలే 50వ పుట్టినరోజు జరుపుకోగా.. బ్రూక్లిన్- నికోలాలకు ఆహ్వానం ఇచ్చినా వారు రాలేదు.
అంతేకాదు.. ఇటీవల న్యూయార్క్‌లో బ్రూక్లిన్- నికోలా మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేయగా.. ఈ వేడుకలో బెక్‌హామ్ ఫ్యామిలీ కనిపించనే లేదు. ఇక క్రీడారంగంలో సేవలు అందించినందుకు గానూ.. కింగ్ చార్లెస్ III ఈ ఏడాది నవంబరులో డేవిడ్ బెక్‌హామ్‌కు ‘సర్’ బిరుదును ప్రదానం చేశారు. ఈ నైట్‌హుడ్ సెర్మనీకి కూడా బ్రూక్లిన్ రాలేదు.
ఈ ఏడాది క్రిస్‌మస్ సెలవులను కూడా బ్రూక్లిన్.. నికోలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు(మే 2)న బ్రూక్లిన్‌ను మిస్ అయినట్లు తండ్రి డేవిడ్ పోస్ట్ పెట్టాడు. అయితే, ఫాదర్స్ డే సందర్భంగా బ్రూక్లిన్ తన తండ్రికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు. అయితే, తన మామగారి (భార్య) తండ్రి ఫొటో పంచుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ అతడి పట్ల అభిమానం చాటుకున్నాడు.

భార్యనే సర్వస్వం
అదే విధంగా.. తన భార్యనే తనకు సర్వస్వం అని.. ప్రపంచంలో ఆమె కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బ్రూక్లిన్ తల్లిదండ్రులను అన్‌ఫాలో చేయడం గమనార్హం.
ఏదేమైనా కోడలి గౌన్ గొడవతో మొదలైన వివాదం.. బెక్‌హామ్ కుటుంబం నుంచి పెద్ద కొడుకు విడిపోయేదాకా చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డేవిడ్- విక్టోరియా- కోడలు నికోలా మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా దిగ్గజ ఆటగాడి కుటుంబం ఇలా చీలిపోతుండటం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా డేవిడ్- విక్టోరియా బెక్‌హామ్‌ల నికర ఆస్తుల విలువ రూ. 8 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా?


