టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదన్నాడు. వరల్డ్‌కప్ జట్టులో వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్‌లకు చోటు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.
గిల్, జితేశ్‌లపై వేటు
కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బీసీసీఐ శనివారం తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో ఆడే 15 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ నుంచి అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)లను తప్పించింది.
వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
వీరిద్దరి స్థానంలో రింకూ సింగ్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. లోయర్ ఆర్డర్‌లో రింకూను.. బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్‌కు స్థానం ఇచ్చింది. రింకూ చాన్నాళ్లుగా టీ20 జట్టులో భాగం కాగా.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి ఇషాన్ పునరాగమనం చేశాడు. అదే విధంగా.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.
వాళ్లిద్దరు దండగ!
ఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘‘ఈ జట్టులో యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ ఎందుకు లేరు?.. ఇషాన్, వాషీ స్థానాల్లో నేనైతే వారినే ఎంపిక చేస్తా. అక్షర్ వైస్ కెప్టెన్ కాబట్టి అతడు కచ్చితంగా తుదిజట్టులో ఉంటాడు.
కాబట్టి వరుణ్ చక్రవర్తి లేదంటే కుల్దీప్ యాదవ్‌ను కాదని మీరు వాషీని ఆడించలేరు కదా!.. ఇక జితేశ్ శర్మ.. జట్టు నుంచి తప్పించేంతంగా అతడు ఏమంత పెద్ద తప్పు చేశాడు? యశస్వి ఓపెనర్‌గా జట్టులో ఎందుకు ఉండకూడదో ఒక్క కారణమైనా చెప్పండి’’ అంటూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
మిశ్రమ స్పందన
ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ఇషాన్ ఇటీవల దేశీ టీ20 టోర్నీలో 500కు పైగా పరుగులు చేసి.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి టీ20 టైటిల్ అందించాడు. జైస్వాల్ చాన్నాళ్లుగా భారత టీ20 జట్టులో ప్రధాన సభ్యుడిగా లేడు. ఇక సంజూకు బ్యాకప్‌గా ఇషాన్ ఉంటాడు కాబట్టే జితేశ్‌ను తప్పించారు.
శ్రీలంకలోని స్లో పిచ్‌లపై వాషీ వంటి ఆల్‌రౌండర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు’’ అంటూ చాలా మంది టీమిండియా అభిమానులు వసీం జాఫర్‌కు బదులిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం!


