భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన జట్టు గురించే భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఏకంగా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పైనే వేటు వేసిన యాజమాన్యం.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను కూడా తప్పించింది.
ఇది సరైన నిర్ణయమే!
అయితే, భవిష్య కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్న గిల్ (Shubman Gill).. టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అతడి కోసం సంజూ శాంసన్ (Sanju Samson)ను బలి చేయడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి. కాబట్టి గిల్‌ను ప్రపంచకప్ జట్టు నుంచి పక్కనపెట్టడం సముచితమేనని మెజారిటి మంది విశ్లేషకుల అభిప్రాయం.
కానీ జితేశ్ శర్మ విషయంలో మాత్రం మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? లేదా? అన్న విషయంపై మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. టాపార్డర్ నుంచి సంజూని తప్పించిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేశ్‌కు యాజమాన్యం పెద్ద పీట వేసింది. లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో కలిసి ఫినిషర్‌గా పనికివస్తాడనే కారణంతో ఇలా చేసింది.
గిల్‌ను తప్పించడంతో
అయితే, గిల్‌ను తప్పించడంతో జట్టు కూర్పులో తేడా రావడంతో జితేశ శర్మ స్థానం గల్లంతైంది. నిజానికి జితేశ్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడు సత్తా చాటాడు. పదకొండు మ్యాచ్‌లలో కలిపి 261 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. స్ట్రైక్‌రేటు 176కు పైగా ఉండటం విశేషం.
టీ20లలో తిరుగులేని ఆటగాడు
బ్యాటర్‌గా రాణిస్తూనే.. రజత్ పాటిదార్ గైర్హాజరీలో కెప్టెన్‌గానూ సత్తా చాటి ఆర్సీబీ మొట్టమొదటిసారి ట్రోఫీని ముద్దాడంలో జితేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా తరపున తనకు అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
ఇప్పటికి 12 అంతర్జాతీయ టీ20లు ఆడిన జితేశ్ శర్మ.. 151కి పైగా స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో 142 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 3163 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా నిలకడైన ఆటతో టీ20లలో తనను తాను ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు జితేశ్ శర్మ.

కచ్చితంగా అర్హుడే.. కానీ
ఈ గణాంకాలు, ప్రదర్శన ఆధారంగా సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టులో ఉండేందుకు జితేశ్ శర్మ వందకు వంద శాతం అర్హుడు. అయితే, గిల్ స్థానంలో ఆల్‌రౌండర్ రింకూ సింగ్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా రింకూ సేవలు అందిస్తాడు.
మరోవైపు.. గిల్ లేడు కాబట్టి అభిషేక్ శర్మ- సంజూ శాంసన్‌లకు తోడుగా మరో బ్యాకప్ ఓపెనర్ కావాలి. ఓవైపు రింకూ రాక.. మరోవైపు.. ఓపెనింగ్ స్థానం కోసం రిజర్వు ప్లేయర్‌ను ఎంపిక చేయాల్సిన తరుణంలో జితేశ్ శర్మపై వేటుపడక తప్పలేదు. బ్యాకప్ ఓపెనర్‌గా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.
అయినా అందుకే వేటు
సంజూ మొదటి ప్రాధాన్య ఓపెనర్, వికెట్ కీపర్‌గా ప్రపంచకప్ టోర్నీలో సేవలు అందించనుండగా.. ఇషాన్ అతడికి బ్యాకప్‌గా ఉంటాడు. ఊహించని రీతిలో గిల్‌పై వేటు, ఇషాన్ కిషన్ రాకతో.. కాంబినేషన్ల కోసం జితేశ్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. జితేశ్ అద్భుతమైన ఆటగాడే అయినా.. కూర్పు కోసం పక్కనపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏదేమైనా తొలి వరల్డ్‌కప్ ఆడాలన్న 32 ఏళ్ల జితేశ్ శర్మ కలకు ఇప్పటికి ఇలా బ్రేక్ పడింది.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


