రోమ్:ఇటలీ అబ్రుజ్జో పర్వత ప్రాంతంలోని పాగ్లియారా డై మార్సి అనే చిన్న గ్రామం. గత 30ఏళ్లుగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. యువకులు, కుటుంబాలు వలస వెళ్లిపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు వెలవెలబోయాయి. మిగిలిన కొద్దిమంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు.
అయితే ఈ నిశ్శబ్దాన్ని మార్చిన సంఘటన ఈ సంవత్సరం మార్చిలో చోటుచేసుకుంది. లారా బుస్సి ట్రాబుక్కో అనే చిన్నారి జననం గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. ఆమె తల్లిదండ్రులు సింజియా ట్రాబుక్కో, పావ్లో బుస్సి. లారా పుట్టడంతో గ్రామ జనాభా 20కి చేరింది. ఒకప్పుడు పిల్లల కిలకిలారావాలు వినిపించని వీధులు ఇప్పుడు కొత్త ఆశతో నిండిపోయాయి.
ప్రభుత్వం నుంచి బోనస్
ఇటీవల యూరప్ దేశాలైన ఇటలీ,స్పెయిన్,జర్మనీలలో జననాల రేటు తగ్గిపోతుంది. దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆయా దేశాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద వెయ్యి యూరోలు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా లారా జన్మించడంతో ఆమె కుటుంబానికి 1000 యూరోలు (సుమారు రూ.90,000) విలువైన బేబీ బోనస్ అందించింది. లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా, ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది. దేశంలో జనన రేటు తగ్గిపోవడం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. పాగ్లియారా డై మార్సి గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ.
గ్రామస్తుల స్పందన
గ్రామస్తులు లారా పుట్టుకను కొత్త జీవంగా భావిస్తున్నారు. మా గ్రామం మళ్లీ బతికింది అని వారు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల పుట్టుకతో గ్రామానికి మళ్లీ భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగిందని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పుట్టిన లారా చిన్నారి పాగ్లియారా డై మార్సి గ్రామానికి కొత్త ఆశను తెచ్చింది. ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామం మళ్లీ జీవం పొందడం, దేశవ్యాప్తంగా జనాభా సంక్షోభంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.


