ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల రేటు దారుణంగా పడిపోతుండడంతో రాబోయే రోజుల్లో దానిని అక్కడి ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది.. అందునా మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్ సహా గర్భ నిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13 శాతం పన్ను విధించి.. తీవ్ర చర్చకు దారి తీసింది.
చైనా ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత మూడేళ్లుగా జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్దం కాలంనాటి గణాంకాల్లో సగం కావడం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడి యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో..
గర్భనిరోధక వస్తువులు (కండోమ్‌లు, మాత్రలు, IUDలు)లపై పన్నులు పెంచగా, చైల్డ్‌కేర్ సేవలు (పిల్లల సంరక్షణ), వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువ పేరెంటల్ లీవ్.. క్యాష్ హ్యాండౌట్లు (ఆర్థిక సహాయం) వంటి ప్రోత్సహాకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుండి కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, IUDలు వంటి వస్తువులపై 13 శాతం వ్యాట్ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కానీ..
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కండోమ్‌ల ధర పెరగడం వల్ల జననాల సంఖ్య పెరగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. చైనాలో కండోమ్‌లపై పన్నులు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగితే, ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇది హెచ్‌ఐవీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులనూ ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్‌ఐవీ కేసులు.. గత దశాబ్దంలో తగ్గినా, యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది.
ట్రోలింగ్..
జననాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెబుతోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు.
మరోవైపు.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కండోమ్స్ ధరలు పెంచడం అంటే.. ముందుగానే రెండు,మూడేళ్లకు ముందే కండోమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా? అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్.. మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నారు.


