నేడు ముంబైలో మోదీ, మేక్రాన్‌ భేటీ | French President Emmanuel Macron arrives in India for AI Impact summit | Sakshi
Sakshi News home page

నేడు ముంబైలో మోదీ, మేక్రాన్‌ భేటీ

Feb 17 2026 5:08 AM | Updated on Feb 17 2026 8:40 AM

French President Emmanuel Macron arrives in India for AI Impact summit

భారత్‌–ఫ్రాన్స్‌ పరస్పర వ్యూహాత్మక బంధంపై సమీక్ష 

న్యూఢిల్లీ: నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ వెనువెంటనే భారత ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ముంబై ఇందుకు వేదికకానుంది. భారత్‌–ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతితో పాటు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంపై అగ్రనేతలు సమీక్ష జరపనున్నారు. వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడంతోపాటు నూతన, కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లోనూ సహకారాన్ని విస్తృత పర్చుకోవడంపై ఇరునేతలు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల పైనా నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. 

ప్రధాని మోదీ ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నాక మేక్రాన్‌తో చర్చిస్తారని కేంద్రం ఒక అధికారిక ప్రకటన వెలువర్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ఆహా్వనించడంతో మేక్రాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారని ఆ ప్రకటన పేర్కొంది. మేక్రాన్‌ ఢిల్లీకి రావడం ఇది నాలుగోసారి కాగా ముంబైలో పర్యటించడం ఇదే తొలిసారి. మంగళవారం ముంబైలోని లోక్‌భవన్‌లో మోదీ, మేక్రాన్‌ చర్చలు మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలుకానున్నాయి. సాయంత్రం 5.15 గంటలకు ఇండియా–ఫ్రాన్స్‌ ఇయర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ 2026ను ఆవిష్కరిస్తారు. తర్వాత ఇరుదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఇతర ఆవిష్కర్తలనుద్దేశించి మోదీ, మేక్రాన్‌ ప్రసంగిస్తారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement