9 మంది న్యాయమూర్తులతో ఏర్పాటు
సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం నిర్ణయం
ఏప్రిల్ 7 నుంచి 22 దాకా తుది విచారణ
ముస్లిం, పార్శీ మహిళల సంబంధిత పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కలిగిస్తూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన 67 పిటిషన్లపై విస్తృత ధర్మాసనం తుది విచారణ జరపనుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తుది విచారణకు ఏప్రిల్ 7 నుంచి 22 దాకా రెండు వారాల సమయం కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. 2018 నాటి తీర్పును వ్యతిరేకించే పక్షాల వాదనలను ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ధర్మాసనం ఆలకించనుంది. ఆ తీర్పును సమర్థించే పక్షాలు ఏప్రిల్ 14 నుంచి 16 దాకా వాదనలు వినిపిస్తాయి.
ఏప్రిల్ 22 నాటికి విచారణను ధర్మాసనం పూర్తి చేయనుంది. మహిళల మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థన స్థలాల్లో వారిపై వివక్షకు సంబంధించి ఇప్పటికే దాఖలైన పలు ఇతర పిటిషన్లను కూడా శబరిమల పిటిషన్లతో పాటే విచారిస్తుంది. మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం, పార్శీయేతర పురుషులను పెళ్లాడే పార్శీ మహిళలకు అగ్ని దేవాలయాల్లోకి ప్రవేశంపై నిషేధం, దావూదీ బోహ్రా సామాజిక వర్గంలో మహిళల్లో అంగవిచ్ఛిత్తి ఆచారం తదితరాలు వీటిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా మతాల్లో మహిళలకు మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థన స్థలాల్లో వారి ప్రవేశంపై నిషేధం తదితరాలకు సంబంధించిన అంశాలపై కూడా ధర్మాసనం కూలంకషంగా విచారణ జరపనుంది. ‘‘ఈ అంశాలకు సంబంధించి ధర్మాసనం లోతుగా విచారణ జరిపి పూర్తి న్యాయం చేకూరుస్తుంది. ఆ మేరకు వాటిపై న్యాయపరంగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది’’అని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రార్థన స్థలాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు, వాదనలతో మార్చి 14 లోపు లిఖితపూర్వక నివేదికలు సమరి్పంచాలని ఆదేశించింది.
2018 నాటి వివాదం...
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా నిషేధం కొనసాగుండటం తెలిసిందే. ఆ మేరకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ప్రవేశం లేదు. ఇది చట్టవిరుద్ధమే గాక రాజ్యాంగానికి కూడా విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2018 సెపె్టంబర్‌లో పేర్కొంది. వారి ప్రవేశంపై నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
దీనిపై కేరళతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఆ తీర్పును సవాలు చేస్తూ ఏకంగా 67 పిటిషన్లు దాఖలయ్యాయి. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యంలోని మరో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వాటిపై విచారణ జరిపింది. శబరిమలతో పాటు మొత్తంగా ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తూ 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
ఏడు అంశాలపై విచారణ
మహిళల మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి మొత్తం ఏడు అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ ధర్మాసనం ప్రాథమికంగా పేర్కొంది. అవి...
→ రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రకారం మతపరమైన స్వేచ్ఛకున్న పరిధి ఏ మేరకు?
→ ఆర్టికల్ 25లో పేర్కొన్న వ్యక్తిగత మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన సంస్థల అధికారాల మధ్య సంబంధాలు ఎలాంటివి?
→ ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన అంశాలు చట్టపరమైన ఇతర నియమ నిబంధనలకు, నైతిక, ఆరోగ్యపరమైన అంశాలకు లోబడాలా?
→ ఆర్టికల్ 25, 26లో పేర్కొన్న నైతికత తాలూకు పరిధి ఏమిటి? ఈ విషయంలో రాజ్యాంగపరమైన నైతికతను ఎలా అర్థం చేసుకోవాలి?
→ ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన పద్ధతులు, ఆచారాలపై న్యాయసమీక్షకు ఉన్న ఆస్కారం ఏ మేరకు?
→ ఆర్టికల్ 25 (2) (బి)లో పేర్కొన్న హిందూ వర్గాలు అంటే ఎవరు?
→ ఏదైనా మతపరమైన ఆచరణను వ్యతిరేకిస్తూ ఆ మతంతో సంబంధం లేనివారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవచ్చా?’’
సమీక్షకే మా ఓటు: కేంద్రం
ఆచితూచి నిర్ణయం: కేరళ
న్యూఢిల్లీ/త్రివేండ్రం/కొట్టాయం: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత తీర్పుపై సమీక్షను కేంద్రం సమరి్థస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సోమవారం విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనానికి ఈ మేరకు ఆయన నివేదించారు. కేరళ ప్రభత్వం మాత్రం ప్రస్తుతానికి సమీక్షను వ్యతిరేకిస్తోందని సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా ధర్మాసనానికి తెలిపారు.
అయితే, ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సమగ్రంగా చర్చించిన అనంతరమే ప్రభుత్వ వైఖరిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేరళ న్యాయ శాఖ మంత్రి పి.రాజీవ్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారంం. కనుక దీనిపై అవును, కాదు అని ఇప్పటికిప్పుడు స్పష్టమైన వైఖరికి రావడం సులువు కాదు.
హిందూ మత విశ్వాసాలపై లోతైన అవగాహన ఉన్న నిపుణులతో దీనిపై కమిటీ వేయాలని గత అఫిడవిట్‌లో మేం పేర్కొన్నాం కూడా’’అన్నారు. అయితే ఈ విషయంలో మత విశ్వాసాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కేరళలో సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో, శబరిమల వివాదంపై ప్రభుత్వం, పార్టీ ఏక వైఖరితో ఉండాల్సిన అవసరం లేదని సీపీఎం పేర్కొంది.
ప్రభుత్వ వైఖరి మారాలి
రుతుక్రమంలో ఉన్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు వీల్లేదని కేరళకు చెందిన రెండు ప్రధాన హిందూ కుల సంస్థలు నాయర్ సరీ్వస్ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్), శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎన్‌ఎన్‌డీపీ) యోగం పునరుద్ఘాటించాయి. ఈ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అవి స్పష్టం చేశాయి.


