చండీగఢ్ చెరువుపై సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని ప్రఖ్యాత సుఖ్నా చెరువు దుస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వెలిబుచ్చారు. ‘సుఖ్నా లేక్ కో ఔర్ కిత్నా సుఖావొగే? (ఆ చెరువును ఇంకెంత ఎండబెడతారు?)’ అంటూ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ మాఫియా ఆ చెరువును చెరబట్టిందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. నేతలు, అధికారులు కూడా వారితో చేతులు కలిపి చెరువును సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సుఖ్నా చెరువుకు సంబంధించి 1995 నుంచి పెండింగ్‌లోలో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అడవులు, చెరువులకు సంబంధించిన కేసులు హైకోర్టులకు వెళ్లకుండా నేరుగా ఇలా సుప్రీం గడప తొక్కుతుండటం ఏమిటంటూ విస్మయం వెలిబుచ్చింది.


