సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
మొదట.. న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ
ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్
ఆ వెంటనే సీజేగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హరియాణ హైకోర్టులో మూడోస్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్‌ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24 పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు.
2028లో జస్టిస్ లీసా గిల్ పదవీ విరమణ.. ఆలోపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం
జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. ఆ లోపు పంజాబ్, హరియాణ రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హరియాణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సహా మొత్తం ముగ్గురు న్యాయమూర్తులున్నారు.
వీరిలో జస్టిస్ సూర్యకాంత్ 2027లో, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ 2028 మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా పదవీ విరమణకు ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది.
కొత్త విధాన నిర్ణయం తీసుకున్న కొలీజియం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో కొత్త విధాననిర్ణయం తీసుకుంది. న్యాయపాలన సామర్థ్యాన్ని, నాణ్యతను బలోపేతం చేయడానికి కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది.
ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో ఆ ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండునెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివల్ల సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అక్కడ ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయిన వెంటనే సీజేగా బాధ్యతలు స్వీకరించడానికి వీలుంటుందని కొలీజియం పేర్కొంది.
గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే, అదే హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కొద్దినెలల తరువాత వేరే హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు. చాలా సందర్భాల్లో హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని మాతృ హైకోర్టు కోటా నుంచి వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమిస్తుండేవారు.
ఆ న్యాయమూర్తి తాత్కాలిక సీజేగా కొంత అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీజే అదే హోదాలో పదవీ విరమణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజే నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ లీసా గిల్ నేపథ్యం..
1966 నవంబర్ 15న జన్మించిన ఆమె చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆమె పంజాబ్, హరియాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.


