పోడియం ఎదురుగా వెల్‌లో కూర్చొని నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
లడ్డూ వద్దా నాయనా!
‘లడ్డూ.. ఇందాపూర్.. హెరిటేజ్’పై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
చర్చకు సరేనంటూనే అధికారపక్షం పలాయనం
స్టేట్‌మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం
స్టేట్‌మెంట్ కాదు.. చర్చ కావాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల పట్టు.. బీఏసీలో అంగీకరించి ఇప్పుడెందుకు భయపడుతున్నారని నిలదీత
‘తిరుమల లడ్డూకి ఇందాపూర్ నెయ్యి’పై వాయిదా తీర్మానం.. చైర్మన్ తిరస్కరణ
ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వం పారిపోయిందంటూ.. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు
టీడీపీ సభ్యుల పోటీ నినాదాలతో సభలో గందరగోళం.. సభ వాయిదా.. అయినా వెల్‌లో నేలపై కూర్చుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన
వారి ఆందోళనతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంగణం
సాక్షి, అమరావతి: ‘‘తిరుమల ప్రసాదంపై చర్చిద్దామంటే భయమెందుకు? బీఏసీలో చర్చకు ఒప్పుకుని ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారు?’’ అంటూ అధికారపక్షాన్ని వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీసింది. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై సభలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలిలో గట్టిగా పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మండలి హోరెత్తింది. చర్చకు పట్టుబడుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం, స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుందని అధికారపక్షం తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. సభను స్తంభింపజేశారు. వాయిదా పడినా సభలోనే రెండుగంటలకు పైగా ఆందోళన చేశారు.
అంతకుముందు అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా ఇవే డిమాండ్లతో వైఎస్సార్సీపీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా వచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ వద్ద మండుటెండలోనే ధర్నాకు దిగారు. కాగా సభలో అధికారపక్ష సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మోషేన్ రాజు మనస్తాపానికి గురయ్యారు. అధికారపక్షం చర్చకు అడ్డుపడడం విచారకరమని వ్యాఖ్యానించారు. అనుమతిలేకుండా స్టేట్‌మెంట్‌కు సిద్ధపడడం చైర్‌ను అవమానించడమేనని స్పష్టం చేశారు.
చర్చిద్దామంటూనే అధికారపక్షం పలాయనం..
తిరుమల లడ్డూకి ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో శాసన మండలి శుక్రవారం వేడెక్కింది. ఈ అంశంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆర్.రమేష్‌యాదవ్, కేఆర్‌జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం ఎక్కి నిరసనకు దిగారు. లడ్డూపై చర్చకు అధికారపక్షం భయపడుతోందని, బీఏసీలో అంగీకరించి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సభ్యులు గట్టిగా నిలదీశారు.
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మార్చి 4వ తేదీన చర్చిద్దామని, అప్పటికి సరిపోకపోతే ఐదు, ఆరు తేదీల్లో కూడా చర్చిద్దామన్నారు. గురువారం లఘు చర్చ అని చెప్పి అధికారపక్షం భయపడి పారిపోయిందని, స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోదని, చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. చర్చకు సిద్ధమంటూనే అధికారపక్షం ఎందుకు పారిపోతోందని వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీశారు. అధికార టీడీపీ సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో 10:19గంటలకు చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.
రెండు గంటలకు పైగా సభలోనే ఆందోళన..
సభ వాయిదా పడిన అనంతరం కూడా చర్చపై పట్టువీడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు దాదాపు రెండు గంటలకుపైగా ఆందోళనను కొనసాగించారు. పోడియం ఎదురుగా వెల్‌లో నేలపై కూర్చోని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసనను కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, వరుదు కళ్యాణి, కల్పలత, మొండితోక అరుణుకుమార్, కాంట్రాక్ట్ ఇసాక్, రమేష్‌యాదవ్, తూమాటి మాధవరావు, పాలవలస విక్రాంత్, వంకా రవీంద్రనాథ్, ఎంవీ రామచంద్రారెడ్డి, ఇజ్రాయేల్, కేఆర్‌జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆందోళన కొనసాగించారు.
హెరిటేజ్ నెయ్యి కల్తీ.. కూటమి పాలన కల్తీ, లడ్డూపై చర్చకు పారిపోయిన ప్రభుత్వం సిగ్గు సిగ్గు, స్వామివారిని కించపరిచిన ప్రభుత్వం, లడ్డూ చర్చపై చిత్తశుద్దిలేని ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అనంతరం 12:53 నిముషాలకు మళ్ళీ సమావేశమైన సభను బుధవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. మళ్లీ సభ వాయిదా పడిన తర్వాత కూడా పది నిముషాలపాటు వైఎస్సార్సీపీ సభ్యులు మండలి వెల్‌లోనే ఆందోళన చేశారు.
వైఎస్సార్సీపీ నిరసనతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంతం..
అంతకు ముందు వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం ఉదయం శాసన మండలి ప్రారంభ సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత వారంతా అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికారత సంస్థ భవన్ కి ఉదయం 9.50 గంటలకు చేరుకొన్నారు. పెద్ద బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
‘‘టీటీడీ లడ్డూ ప్రసాదం పై చర్చ అంటే భయమెందుకు? .. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందన్న భయమా? .. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై వెంటనే సభలో చర్చ జరగాలి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ‘‘ప్రకటన కాదు...చర్చ జరపాలి, లడ్డూపై చర్చ జరిగితే...నిజాలు ప్రజలకు తెలుస్తాయని భయమా ? లడ్డూ అంశంపై చర్చ అంటే..పాలకపక్షానికి భయమెందుకు?
చర్చ అంటేనే పారిపోయిన ప్రభుత్వం...సిగ్గు సిగ్గు, చర్చ జరగాలి...హెరిటేజ్ దోపిడీ ప్రజలకు తెలియాలి, చర్చ జరిగితే మీ హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందని భయమా ?, దైవం పవిత్రతను దెబ్బతీసి...హెరిటేజ్ దోపిడీకి బాటలు వేసుకుంటారా?’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టుకుని అసెంబ్లీ గేట్ నెంబర్ 4 వరకు ప్రదర్శనగా వచ్చి గేటు వద్ద బైఠాయించారు. ఎమ్మెలీల నినాదాలతో అసెంబ్లీ సమీప ప్రాంతం మార్మోగిపోయింది. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ సభ్యులంతా శాసనమండలిలోకి వెళ్లారు.
మండుటెండలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ధర్నా...
వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాసన మండలి నుంచి ప్రదర్శనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ అసెంబ్లీ గేట్ – 2 వద్దకు వచ్చారు. గేటు బయట రోడ్డుపై మండుటెండలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సభ్యులందరూ టీటీడీ లో హెరిటేజ్ పాత్రపై విచారణ జరపాలి, మీ హెరిటేజ్ కోసం దైవం పై నిందలా.. సిగ్గు సిగ్గు, భోలే బాబా వెనుక ఉన్న అలీ బాబా..చంద్ర బాబే, ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ నశించాలి, మీ రాజకీయాల కోసం దైవం ప్రవిత్రతను అవమానించిన చంద్రబాబు...వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, భోలే బాబాను తెచ్చింది..హెరిటేజ్ బాబే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీల నినాదాలతో అసెంబ్లీ ఆవరణ మార్మోగిపోయింది.
స్టేట్‌మెంట్ ఇచ్చేసి తప్పించుకునే పన్నాగం..
లడ్డూ గురించి చర్చ జరిగితే హెరిటేజ్ అవినీతి బయటకొస్తుందనే భయంతో స్టేట్‌మెంట్ ఇచ్చేసి తప్పించుకోవాలనే పన్నాగానికి మంత్రి పయ్యావుల కేశవ్ తెరదీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు.. తన కుట్రలు బయటకు రావడంతో సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు సమాధానం చెప్పాల్సిందిపోయి మరింత దిగజారి ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు.’’ అని అరుణ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కలలో కూడా ఎవరూ వినకూడని మాటలతో తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడు. కల్తీ నెయ్యి పేరుతో వైఎస్సార్‌సీపీ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు, సీబీఐ సిట్ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయాడు. వారి హయాంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోకుండా వైయస్సార్సీపీ మీద నిందలు మోపడం సిగ్గుచేటు.’’ అని విమర్శించారు.

అనుమతిలేకుండా స్టేట్‌మెంట్.. చైర్‌ను అవమానించడమే..
టీడీపీ సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం
శాసన మండలిలో లడ్డూపై చర్చను అధికారపక్షం అడ్డుకోవడం విచారకరమని, తన అనుమతి లేకుండా సభలో ఆర్థిక మంత్రి స్టేట్‌మెంట్ పెట్టేందుకు సిద్ధపడటం చైర్‌ను అవమానించడమేనని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు.. శుక్రవారం ఉదయం మండలి సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ మాట్లాడుతూ.. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించి అధికారపక్ష సభ్యుల తీరుపై మనస్తాపం చెందారు.
మోషేన్‌రాజు ఏమన్నారంటే.. ‘‘నిన్నటి రోజు లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ పునః ప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్‌ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్‌కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్‌ను జరిపించాలని అడిగారు. లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే యత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో అర్థిక శాఖ మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేశారు. షార్ట్ డిస్కషన్ కోసం జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్‌పై నోట్స్ పంపించారు.
ఆ ప్రతిని చూపించి.. నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికేందుకు టీడీపీ సభ్యులు యత్నించారు. సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఇది కూడా కరెక్టు కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ఇరు పక్షాల సభ్యులు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని తెలియజేస్తున్నా’’ అని చైర్మన్ మోషేన్‌రాజు పేర్కొన్నారు. చైర్మన్ మాటలకు అడ్డుతగులుతూ మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ఇంకా పొడిగించి చైర్‌ను అవమానించాలనుకోవడం సరికాదంటూ చైర్మన్ తేల్చిచెప్పారు.
ఆ తర్వాత చైర్మన్ అనుమతించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షం ముందుగా నోటీసు ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి చర్చించేందుకు సిద్ధమయ్యామని, ఆ ముందు రోజునే తమ శాసన సభ్యుడితో నోటీసు ఇప్పించి శాసన సభలో చర్చించామని, అక్కడ జరిగిందే.. మండలిలో జరిగేలా చేశామని పేర్కొన్నారు. దీనికి చైర్మన్ మోషేన్ రాజు స్పందిస్తూ మండలిలో ప్రొసీడింగ్స్ వేరు అని, స్టేట్‌మెంట్ ఇచ్చాక చర్చ కాదని, చర్చ వేరు స్టేట్‌మెంట్ వేరని స్పష్టం చేశారు.
అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తర్వాత చైర్మన్ చాంబర్‌కు పలువురు మంత్రులు వెళ్లి మాట్లాడినట్టు సమాచారం. సభలో చైర్మన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరు సరికాదని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రుల వద్ద చైర్మన్ మళ్లీ తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
అధికారపక్షం పలాయనమంత్రం
తిరుమల లడ్డూకు ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించేందుకు సిద్ధమేనంటూ పైకి గంభీరమైన మాటలు చెబుతున్న అధికారపక్షం తీరా చర్చ సమయానికి పలాయనం చిత్తగిస్తోంది. తిరుమల లడ్డూలో ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో గత ఐదు రోజులుగా మండలి కార్యకలాపాలు స్థంభించాయి. దీంతో ప్రభుత్వ బిజినెస్ ఆమోదించుకోవడం మెట్టు దిగిన అధికారపక్షం ఈ నెల 26న లడ్డూపై స్వల్పకాలిక చర్చకు సిద్ధమని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీలో అంగీకరించింది.
తీరా గురువారం ప్రశ్నోత్తరాల అనంతరం జరగాల్సిన చర్చ సమయం వచ్చే సరికి అధికార పక్షం మాట మార్చింది. చర్చ కాదు.. ప్రభుత్వం తరపున స్టేట్‌మెంట్ ఇస్తామని మెలికపెట్టింది. నిబంధనలు అంగీకరించవని చైర్మన్ చెప్పినా.. వినని శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేసిన తర్వాతనే చర్చను మొదలుపెట్టాలని పట్టుబట్టారు. దీంతో చర్చను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్ మోషేన్‌రాజు వైఎస్సార్‌సీపీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో మంత్రి కేశవ్ స్టేట్‌మెంట్‌పై బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. ముందుగా మంత్రి స్టేట్‌మెంట్ సరికాదని, చర్చ అంటే సభ్యులు మాట్లాడతారని చైర్మన్ స్పష్టం చేశారు.
ఆ స్టేట్‌మెంట్ మీరు అనుమతి ఇచ్చిందేనని మంత్రి కేశవ్ గురువారం సభలో చైర్మన్‌తో ప్రస్తావించారు. అసలు ఆ స్టేట్‌మెంట్ విషయం నాకు తెలియదని, అది సరికాదని చైర్మన్ అభ్యంతరం తెలిపారు. స్టేట్‌మెంట్ అని అధికార టీడీపీ, చర్చ కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పట్టుబట్టాయి. గందరగోళ పరిస్థితుల మధ్య గురువారం మండలి చర్చ మధ్యలోనే ఆపి సభను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. గురువారం చర్చను ప్రారంభించినందున శుక్రవారం అదే చర్చను కొనసాగించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేతల బొత్స సత్యనారాయణ చైర్మన్ మోషేన్‌రాజుకు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసారు.
అయినా శుక్రవారం మళ్లీ చర్చకు అవకాశం లేకుండా ఎజెండాలో సైతం పెట్టకుండా నీటిపారుదల అంశాన్ని లఘు చర్చకు పెట్టారు. శుక్రవారం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో మళ్లీ రగడ రేగింది. గురువారం నాటి సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందిన చైర్మన్ మోషేన్‌రాజు శుక్రవారం సభ ప్రారంభంకాగానే ముందు రోజు పరిణామాలు సరికాదని తప్పుబట్టారు. చర్చ కోసం మళ్లీ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలిలో పలాయనమంత్రం పఠిస్తున్న అధికార టీడీపీ మాత్రం మార్చి 4న చర్చను చేపడతామంటూ మళ్లీ కొత్తరాగం అందుకుంది. మొత్తానికి మండలిలో పరిణామాలు అధికారపక్షానికి చెమటలు పట్టిస్తున్నాయి. ప్రజల్లో పాలకపక్షం పరువును పలచన చేస్తున్నాయి.


