హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ
ఇందాపూర్‌కు టీటీడీ నిధుల కైంకర్యం
ఆన్‌లైన్, బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరకు కాంట్రాక్టు ఖరారు
ఇందాపూర్ డెయిరీ ఆన్‌లైన్‌లో కిలో నెయ్యి ధర రూ.529
టీటీడీకి మాత్రం ఏకంగా కిలో రూ.638 చొప్పున సరఫరా
ఆన్‌లైన్‌లో కంటే కిలోకు ఏకంగా రూ.109 అధిక ధరతో విక్రయం
ఆన్‌లైన్‌లో విక్రయానికి ప్యాకింగ్, మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్ట్, హోల్‌సేల్, రిటైల్ డీలర్ల కమీషన్ ఖర్చు ఎక్కువ
టీటీడీకి మాత్రం నేరుగా ట్యాంకర్ల ద్వారా సరఫరాతో పై ఖర్చులు ఆదా
దోపిడీ జరుగుతోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు చెందిన సంగం డెయిరీకీ అడ్డగోలు కాంట్రాక్టులు
5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన చంద్రబాబు
జాతీయ డెయిరీలను బెదిరించి మరీ దందా
కల్తీ కేసులో సీబీఐ కేసు పెట్టిన ‘వైష్ణవి’కి సంగంకు వ్యాపార బంధం
బంధం బయట పడడంతో హడావుడిగా గేట్ల రంగులు మార్చేసిన ముఠా..
కల్తీ కేసులో వైష్ణవి డెయిరీ సీఈఓను అరెస్టు చేసిన సీబీఐ
బాబు హయాంలోనే కల్తీ ట్యాంకర్లు టీటీడీకి సరఫరా చేసినట్లు గుర్తించిన సీబీఐ
ఇదీ చంద్రబాబు నిర్వాకం... నివ్వెరపోతున్న భక్తులు
సాక్షి, అమరావతి: నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అండ్ కో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటోంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ ఆన్‌లైన్‌లో కిలో నెయ్యి రూ.529 చొప్పున విక్రయిస్తోంది. మరి ఇదే ఇందాపూర్ డెయిరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా రూ.638 చొప్పున సరఫరా చేస్తోంది. అంటే ఆన్‌లైన్‌లో కంటే టీటీడీకి కిలోకు రూ.109 అధిక ధరకు విక్రయిస్తోంది.
వాస్తవానికి ఆన్‌లైన్‌లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి మరీ వినియోగదారులకు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్‌లైన్‌లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి.
కానీ కిలోకు ఏకంగా రూ.109 అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్‌తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్‌లో ఏపీలో కిలో రూ.541 చొప్పున, హైదరాబాద్‌లో కిలో రూ.560 చొప్పున విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్ విధానంలో.. నెయ్యిని ప్యాకింగ్ చేసి, డెయిరీ హోల్‌సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ చార్జీలు, రవాణా చార్జీలతోపాటు హోల్‌సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకుని మరీ ధరను నిర్ణయిస్తారు.
కానీ టీటీడీకి డెయిరీనే నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్‌సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్, రవాణా వ్యయం తగ్గుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి నెయ్యిని కిలోకు రూ.97 అధిక ధరకు విక్రయిస్తోంది.
అంటే ఆ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. అంటే ఏ స్థాయిలో దోపిడీ చేస్తోందనేది విభ్రాంతి కలిగిస్తోంది. ఈ దందా బయట పడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డెయిరీ అనే విషయాన్ని వెబ్‌సైట్‌లో తొలగించి, కో మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది.
ఇందాపూర్’ రూటులోనే సంగం కల్తీ ‘వైష్ణవి’తో వ్యాపార బంధం
» తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల టీడీపీ గోబెల్స్ ప్రచార టీమ్‌లో ముఖ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్టును బహుమతిగా ఇచ్చారు. సంగం డెయిరీకి కూడా కిలో రూ.599 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేశారు. అంటే కిలోకు రూ.58 అధిక ధరకే కట్టబెట్టారు. ఆ విధంగా సంగం డెయిరీకి రూ.29.95 కోట్ల విలువైన 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు.

» ఇంతటి దోపిడీ సాగించేందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ముందస్తు కుట్రతోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది స్పష్టమవుతోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కోసం టీటీడీ పిలిచిన టెండర్లను సంగం డెయిరీకి కట్టబెట్టాలని నిర్ణయించారు.
బిడ్లు దాఖలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ఇతర డెయిరీల యాజమాన్యాలను ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే టీటీడీ మూడు సార్లు టెండర్లు పిలిచినా ఏ డెయిరీ కూడా బిడ్లు దాఖలు చేయ లేదని వినిపిస్తోంది. ఈ కారణం సాకుగా చూపి ఆ టెండర్ నోటిఫికేషన్లను టీటీడీ రద్దు చేసింది.
» తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన భోలేబాబా డెయిరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైంది. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డెయిరీకి పంపించి... అక్కడ నుంచి తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు వెలుగు చూసింది.
» టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేవని వెల్లడైనా సరే అవే ట్యాంకర్లను కొన్ని రోజుల తరువాత తిరుమలకు పంపినట్టు కూడా వెల్లడైంది. దాంతో ఏఆర్ డెయిరీ, భోలే బాబా డెయిరీ ప్రతినిధులతోపాటు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చద్వాను అరెస్టు చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ వ్యవహారం బరితెగించి సాగించారు. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అంతా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది స్పష్టమైంది.
» తిరుపతి జిల్లా పెనబాకలో ఉన్న వైష్ణవి డెయిరీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందని సీబీఐనే నిగ్గు తేల్చింది. అసలు వైష్ణవి డెయిరీకి అంత అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందంటే... వైష్ణవి డెయిరీ టీడీపీ సిండికేట్‌లో సభ్య డెయిరీనే.
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా ఉన్న గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ వ్యాపార భాగస్వాములు. ఆ రెండింటి మధ్య దృఢమైన వ్యాపార బంధం ఉందని తాజాగా వెల్లడైంది. వైష్ణవి డెయిరీ వెబ్‌సైటే ఆ విషయాలను పేర్కొనడం గమనార్హం. తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డెయిరీ ప్రధాన ద్వారంపై సంగం డెయిరీ ఎంబ్లమ్ కూడా ముద్రించి ఉంది. సంగం డెయిరీ ట్యాంకర్లు వైష్ణవి డెయిరీలోకి వెళ్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.

» చాలా జిల్లాల్లో వైష్ణవి, సంగం డెయిరీలు ఉమ్మడిగా రిటైల్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే గతంలో భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా సరఫరా చేశారు. భోలేబాబా డెయిరీ వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం సంగం డెయిరీ ద్వారా కథ నడపించాలని ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది.
» అందుకోసం టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సాగించిన బాగోతం ఇలా ఉంది... కాగా వైష్ణవి – సంగం డెయిరీల బంధం బయటపడడంతో ఎంబ్లమ్ లు కనపడకుండా వైష్ణవి గేట్ల రంగులు మార్చేయడం గమనార్హం. అంతేకాకుండా రెండు డెయిరీల వెబ్‌సైట్లను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని చూస్తే.. వాటి మధ్య బంధం మరింతగా బట్టబయలైందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు తలొగ్గిన జాతీయ డెయిరీలు
» సంగం డెయిరీకి అనుకూలంగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. సంగం డెయిరీకి అనుకూలంగా నిబంధనలు విధించారు. అయిదేళ్ల అనుభవం ఉండాలి...వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు ఉండాలన్న నిబంధనలే అందుకు తార్కాణం. పోటీలో ఉండకుండా ఇతర డెయిరీలను బెదిరించారు. ముందే రింగ్‌గా ఏర్పడి సంగం డెయిరీకి అనుకూలంగా సిండికేట్ వ్యవహారం నడిపారు.
» సంగం డెయిరీకి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాలని ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉందని జాతీయ డెయిరీ సంస్థలకు అర్థమైంది. కాదని తాము బరిలో ఉంటే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని కూడా ఆ డెయిరీల యాజమాన్యాలు భయపడ్డాయి. దాంతో ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకున్నాయి.
ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన ధరకు బిడ్లు దాఖలు చేసి సంగం డెయిరీకి మార్గం సుగమం చేశాయి. ఎంత పక్కాగా కథ నడిపారు అంటే.. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు తేదీ 2025, సెప్టెంబరు 4 తో ముగిసిన రెండు రోజుల్లోనే అంటే సెప్టెంబరు 6నే టీటీడీ టెక్నికల్ కమిటీ సభ్యులు సంగం డెయిరీని సందర్శించి సానుకూలంగా నివేదిక సమర్పించారు.
» అంటే సంగం డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. కర్ణాటక సహకార పాడి రైతుల ఫెడరేషన్‌ను పక్కనపెట్టేశారు. ఇక జాతీయస్థాయి డెయిరీలు కిలో నెయ్యి రూ.600 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేశాయి. ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం సంగం డెయిరీ ఒక్క రూపాయి తక్కువకు అంటే కిలో నెయ్యి రూ.599 చొప్పున సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దాంతో సంగం డెయిరీకి 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఖరారు చేసింది. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తోపాటు టీటీడీ పాలకమండలి అందుకు ఆమోదముద్ర వేసింది.
ఏది కల్తీ... ఏది దోపిడీ చంద్రబాబూ..
తమ దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. టీటీడీకి నెయ్యి కిలో రూ.325 చొప్పున సరఫరా చేయగా ఆ ధరను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.638కి పెంచింది. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టడానికి ఇలా చేశామని వితండవాదం లేవనెత్తింది. రూ.638 చొప్పున అయితేనే నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేయగలమని చెబుతోంది. మరి అదే ఇందాపూర్ డెయిరీ ఆన్‌లైన్‌లో కిలో రూ.529 చొప్పున బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.541 చొప్పున ఎలా విక్రయిస్తున్నట్టు?
అంటే ఆన్‌లైన్, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది కల్తీ నెయ్యి అని ఆ డెయిరీ ఒప్పుకుంటున్నట్టా? కాదు.. తిరుమల శ్రీవారి నిధులు కదా... బరితెగించి దోపిడీ చేసేందుకే కిలో నెయ్యి ఏకంగా రూ.638 చొప్పున ధర నిర్ణయించినట్టు సమ్మతించినట్టే కదా. అదే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు ముఠా బరితెగించి సాగిస్తున్న అవినీతి దందాతో యావత్ భక్తులు నివ్వెరపోతున్నారు.


