‘పడితేనే రెండు ఎముకలు విరిగాయి.. కొడితే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’ | Senior IPS Sunil Kumar Questions Custodial Torture Allegations, Shares X-Rays Of Raghurama Krishna Raju Injury On Social Media | Sakshi
Sakshi News home page

‘పడితేనే రెండు ఎముకలు విరిగాయి.. కొడితే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’

Feb 28 2026 4:49 AM | Updated on Feb 28 2026 1:21 PM

Senior IPS Sunil Kumar on Raghuramakrishna Rajus broken bones

పీవీ సునీల్‌ కుమార్‌ తన సోషల్‌ మీడియా ఖాతా లో పెట్టిన పోస్టు

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు ఎముకలు విరగటంపై సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌  

రెండు ఎక్స్‌రే రిపోర్టులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘కస్టోడియల్‌ టార్చర్‌ కథ’ అబద్ధమంటూ పోస్టులు 

సాక్షి, అమరావతి: ‘కస్టోడియల్‌ టార్చర్‌ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగే వ్యక్తిని.. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’ అని సీనియర్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆ రెండు ఘటనలకు సంబంధించిన ఎక్స్‌రే కాపీలను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ఆయన శుక్రవారం పెట్టిన రెండు వేర్వేరు పోస్టులు వైరల్‌గా మారాయి. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు క్రికెట్‌ ఆడుతూ పొరపాటున కింద పడటంతో ఆయన చేతి ఎముకలు విరిగాయి. దీంతో ఆయనను హైదరాబాద్‌ తరలించి ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పీవీ సునీల్‌కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘రఘురామకృష్ణరాజు పొరపాటున కింద పడితేనే ఆయన చేతి ఎముకలు రెండు విరిగాయి. నిజంగా ఆయన్ని ఆనాడు కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి. అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే’ అని సునీల్‌కుమార్‌ ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం క్రికెట్‌ ఆడుతూ కిందపడటంతో రఘురామకృష్ణరాజు చేతికి ఫ్రాక్చర్‌ అయిన ఎక్స్‌రే కాపీని ఆయన పోస్టు చేశారు. అందులో ఆయన చేతి ఎముకలు విరిగిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇక రఘురామకృష్ణరాజు ఆరోపించినట్టు గతంలో కస్టోడియల్‌ టార్చర్‌ అనంతరం వైద్య పరీక్షలు చేసి తీసిన ఎక్స్‌రే కాపీని కూడా పీవీ సునీల్‌కుమార్‌ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తన కాలు ఎముకలు విరిగేలా సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎక్స్‌రేలో ఆయన కాలు ఎముక విరిగినట్టు ఏమీ లేదు. ఆయన కాలికి ఎటువంటి గాయాలు లేనే లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండు ఎక్స్‌రే కాపీలను  పక్కపక్కనే పెట్టి పోస్టు చేసి పీవీ సునీల్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో సంధించిన ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement