భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.
పూర్వాపరాలు ఇవే
ప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
టీమిండియా అనకూడదు
ప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.
దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
మీ సమస్య ఏమిటి?
ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది
అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.
ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!


