కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.
గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ అభ్యంతరాలివే..
ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్‌భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.
గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.
కోర్టు ఏం చెప్పిందంటే..
గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్‌కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.
సభ ఆగిపోతుందా?..
రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట.


