తదుపరి ‘డేవిస్’ పోరుకు పరిశీలిస్తాం
భారత కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అనుభవజ్ఞుడైన శ్రీరామ్ బాలాజీ భారత టెన్నిస్‌లో కీలక ఆటగాడని, తదుపరి డేవిస్ కప్ ‘టై’ కోసం అతని పేరును తప్పకుండా పరిశీలిస్తామని భారత కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడే భారత జట్టుకు డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ బాలాజీ పక్కన బెట్టారు. దీనిపై రాజ్‌పాల్ స్పందిస్తూ మేలైన కాంబినేషన్‌లో భాగంగానే అతన్ని పక్కన బెట్టాల్సి వచ్చిందని అన్నాడు.
బాలాజీ జట్టు అవసరాల కోసం గతంలో సింగిల్స్ కూడా ఆడాడని కెప్టెన్ గుర్తు చేశాడు. సీనియర్ డబుల్స్ ఆటగాడిని తప్పకుండా తదుపరి డేవిస్ కప్ మ్యాచ్‌ల కోసం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ‘డబుల్స్‌లో మంచి కాంబినేషన్ కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా ‘డ్యూస్–కోర్ట్’ ప్లేయర్ అయితే బాగుంటుందనిపించింది.
యూకీ బాంబ్రీ ‘ఆడ్–కోర్ట్’ ప్లేయర్ అందుకే హైదరాబాదీ ఆటగాడు రిచ్చింక్ బొల్లిపల్లిని ‘డ్యూస్–కోర్ట్’ ప్లేయర్‌గా భావించి యూకీకి జతగా ఎంపిక చేశాం’ అని రాజ్‌పాల్ వివరణ ఇచ్చాడు. డ్యూస్–కోర్ట్ అంటే ఆట మొదలయ్యే కోర్ట్ కుడివైపున ఉండేది. ఆడ్–కోర్ట్ అంటే అడ్వాంటేజ్ ఎడమ వైపున ఉంటుంది.
ఆర్యన్ షా అవుట్
భారత డేవిస్ కప్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన ఆర్యన్ షాను తొలగించినట్లు ఆలిండియా టెన్నిస్ సంఘం (ఐటా) స్పష్టం చేసింది. ‘నెదర్లాండ్స్‌తో జరిగే డేవిస్ పోరుకు అందుబాటులో ఉంటానని ఆర్యన్ చెప్పడంతోనే అతని రిజర్వ్ ఆటగాడిగా తీసుకున్నాం. కానీ జట్టును ప్రకటించాక తాను ఆ సమయంలో అందుబాటులో ఉండలేనంటూ ఐటాకు లేఖ రాశాడు.
ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కానేకాదు’ అని ఐటా ఉన్నతాధికారి ఒకరు ఆర్యన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సింగిల్స్‌లో 403 ర్యాంకర్ ఆర్యన్ షా భారత నంబర్ వన్ సుమిత్ నగాల్ (277 ర్యాంకు) తర్వాత మేటి ర్యాంక్ ప్లేయర్. అయితే అతని కన్నా తక్కువ ర్యాంకుల్లో ఉన్న కరణ్ (471), దక్షిణేశ్వర్ సురేశ్ (524) ప్రధాన జట్టుకు ఎంపిక చేసిన తనను మాత్రం రిజర్వ్‌గా ఉంచడంతో తప్పుకున్నాడు.


