
రివర్స్ సింగిల్స్‌లో గెలిపించిన నగాల్
3–1తో స్విట్జర్లాండ్‌పై విజయం
డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్‌లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది. డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 టైలో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3–1తో విజయం సాధించింది. తొలి రోజు కొత్త కుర్రాడు దక్షిణేశ్వర్‌తో పాటు భారత స్టార్ సుమిత్ నగాల్ వరుస విజయాలతో సింగిల్స్‌లో 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు రెండో రోజు శనివారం డబుల్స్‌లో పరాజయం ఎదురైంది. దీంతో భారత్ ఆధిక్యం 2–1కి తగ్గింది.
ఈ దశలో రివర్స్ సింగిల్స్ బరిలోకి దిగిన భారత నంబవర్‌వన్ టెన్నిస్ స్టార్ సుమిత్ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్‌పై విజయం సాధించాడు. దీంతో ఈ ‘టై’లో భారత్ గెలుపొందింది. ఫలితం రావడంతో నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం 2022లో డెన్మార్క్‌పై గెలిచినప్పటికీ ఇది న్యూఢిల్లీ వేదికపై జరిగింది. తాజా విజయంతో డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు భారత్ అర్హత సాధించింది. తొలిరౌండ్ డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోటీలు వచ్చే జనవరిలో జరుగుతాయి.
అంతకుముందు జరిగిన డబుల్స్‌లో భారత బృందానికి నిరాశ ఎదురైంది. శ్రీరామ్ బాలాజీతో జోడీగా బరిలోకి దిగిన తెలంగాణ ఆటగాడు రితి్వక్ బొల్లిపల్లి జంటకు ఆతిథ్య స్విట్జర్లాండ్ జోడీ చేతిలో చుక్కెదురైంది. రితి్వక్–బాలాజీ ద్వయంకు 7–6 (8/3), 4–6, 5–7తో జాకుబ్ పాల్–డామినిక్ స్ట్రికెర్ జంట చేతిలో పరాజయం ఎదురైంది. మొత్తమ్మీద విదేశీ గడ్డపై భారత్ చివరిసారిగా 1993లో గెలిచింది.