అండర్–19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్
ఉదయం గం. 10:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: అండర్–19 ఆసియాకప్‌లో ఘనవిజయంతో బోణీ కొట్టిన యువ భారత జట్టు ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని యంగ్ ఇండియా భావిస్తోంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్ షేక్’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 234 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి మంచి జోష్‌లో ఉంది. ఐపీఎల్ సహా సీనియర్ స్థాయిలో ఆడిన పలు టోర్నమెంట్‌లలో సెంచరీలతో విజృంభించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది.
యూఏఈతో పోరులో అతడు 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 171 పరుగులు చేసి అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా అతడు అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైస్‌కెపె్టన్ విహాన్ మల్హోత్రాతో పాటు హైదరాబాద్ ఆటగాడు ఆరోన్ జార్జి మంచి టచ్‌లో ఉన్నారు. వీరంతా సమష్టిగా సత్తాచాటితే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 297 పరుగుల తేడాతో మలేసియాపై గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరీహోరీ ఖాయమే!


