నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్ పశ్చిమ్ రాయల్స్‌తో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లయన్స్ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో సుదుర్ పశ్చిమ్ రాయల్స్, లుంబిని లయన్స్ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ సహా ట్రంపెల్మన్ (2.1-0-3-3), షేర్ మల్లా (4-0-18-3), తిలక్ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్, దీపక్ బొహారా, పూనీత్ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్ (13), హర్మీత్ సింగ్ (10), కుగ్గెలిన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ దినేశ్ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లయన్స్ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్ 14, నిరోషన్ డిక్వెల్లా 11, రోహిత్ పౌడెల్ 16 పరుగులు చేసి లయన్స్ గెలుపుతో భాగమయ్యారు.
రాయల్స్ బౌలర్లలో హేమంత్ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్ ట్రంపెల్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి.


