నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్‌పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్‌పీఎల్‌లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.
గుజరాత్‌కు చెందిన 35 పంచల్‌కు దేశవాలీ సూపర్ స్టార్‌గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా జరిగిన హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్‌కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్‌లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.
కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్‌లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.


