ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ సిక్సర్ల రికార్డు చేరింది. బిగ్ బాష్ లీగ్ 2025-26 ఎడిషన్‌లో భాగంగా సిడ్నీ థండర్‌తో ఇవాళ (డిసెంబర్ 28) జరిగిన మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. బీబీఎల్ కెరీర్‌లో 150 సిక్సర్ల మార్కును దాటాడు.
తద్వారా లీగ్ చరిత్రలో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్ మాత్రమే 150 సిక్సర్ల మార్కును తాకాడు. లిన్ ఖాతాలో ప్రస్తుతం 220 సిక్సర్లు ఉన్నాయి.
బీబీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల టాప్-5 జాబితాలో లిన్, మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో బెన్ మెక్‌డెర్మాట్ (140), ఆరోన్ ఫించ్ (118), మార్కస్ స్టోయినిస్ (111) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ థండర్‌పై మ్యాక్స్‌వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. హరీస్ రౌఫ్ (4-0-29-3), టామ్ కర్రన్ (4-0-22-2), స్టోయినిస్ (3-0-25-2), మిచెల్ స్వెప్సన్ (4-0-18-2), పీటర్ సిడిల్ (4-0-22-1) దెబ్బకు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 128 పరుగులకు ఆలౌటైంది.
థండర్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (25) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ గిల్క్స్ (24), సామ్ బిల్లింగ్స్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో కొన్‌స్టాస్ 11, డేవిడ్ వార్నర్ 10, బాన్‌క్రాఫ్ట్ 10, డేనియల్ సామ్స్ 3, క్రిస్ గ్రీన్ 1, తన్వీర్ సంఘా 1, ర్యాన్ హ్యాడ్లీ 1 పరుగు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మెల్‌బోర్న్ ఒకే వికెట్ కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. జో క్లార్క్ (37 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద సెంచరీతో మెల్‌బోర్న్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అనంతరం సామ్ హార్పర్ (29 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.


