2025-26 ఎడిషన్ బిగ్‌బాష్ లీగ్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ అవతరించింది. ఇవాళ (జనవరి 25) జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. స్కార్చర్స్ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో టైటిళ్లు సాధించింది.
ప్రస్తుత ఎడిషన్‌లో స్కార్చర్స్‌కు టైటిల్ అందించిన ఆష్టన్ టర్నర్ గతంలో మరో రెండు టైటిళ్లు (కెప్టెన్) అందించాడు. తద్వారా లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. బీబీఎల్ నిర్వహకులు ఈ ఎడిషన్‌లో కొత్త ఆనవాయితీకి తెరలేపారు.
విజేతలను అందించే మెడల్స్‌ను చిన్నారుల చేత ఇప్పించారు. స్కార్చర్స్ కెప్టెన్ టర్నర్ తన విన్నింగ్ మెడల్‌ను తన ముగ్గురు సంతానం చేతుల మీదుగా అందుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జై రిచర్డ్స్ (4-0-32-3), డేవిడ్ పేన్ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్ (4-0-29-2), ఆరోన్ హార్డీ (3-0-16-1), కూపర్ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.
సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్, కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ తలో 24 పరుగులు చేయగా.. జోయల్ డేవిస్ 19, లచ్లాన్ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (44), ఫిన్ అలెన్ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్ ఇంగ్లిస్ (29 నాటౌట్) పూర్తి చేశాడు. ఇంగ్లిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ (4-0-19-2), మిచెల్ స్టార్క్ (4-0-33-1), జాక్ ఎడ్వర్డ్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.


