స్టీవ్‌ స్మిత్‌ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో | Steve Smith smacks four consecutive sixes, completes century in just 41 balls | Sakshi
Sakshi News home page

BBL 2025-26: స్టీవ్‌ స్మిత్‌ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో

Jan 16 2026 6:09 PM | Updated on Jan 16 2026 6:52 PM

Steve Smith smacks four consecutive sixes, completes century in just 41 balls

బిగ్ బాష్ లీగ్‌-2025లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్సకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్‌.. శుక్రవారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 190 పరుగుల లక్ష్య చేధనలో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సిడ్నీ థండర్ బౌలర్ రైన్ హాడ్లీని స్మిత్ టార్గెట్ చేశాడు. రైన్ హాడ్లీ వేసిన 12వ ఓవర్‌లో స్మిత్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లో తన నాలుగో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను స్మిత్ అందుకున్నాడు.

స్మిత్ 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు బాబర్ ఆజం(39 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సిడ్నీ సిక్సర్‌ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సిడ్నీకి ఇది వరుసగా నాలుగో విజయం.

వార్నర్ సెంచరీ వృథా..
ఇక ఇదే మ్యాచ్‌లో ఆసీస్ మాజీ ఓపెనర్, సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శతక్కొట్టాడు. 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి వార్నర్‌ అజేయంగా నిలిచాడు. మిగితా ప్లేయర్ల నుంచి పెద్దంగా సహకరం లేకపోవడంతో సిడ్నీ 200 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్‌ బౌలర్లలో సామ్‌కుర్రాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్‌, స్టార్క్‌, బెన్ మనేంటి తలా వికెట్‌ సాధించారు. కాగా వార్నర్‌కు ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండో సెంచరీ.

స్మిత్ స‌రికొత్త చ‌రిత్ర‌
ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన స్మిత్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.  బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత‌వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన రెండో ప్లేయర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో మిచెల్ ఓవెన్, క్రెయిగ్ సిమన్స్ అగ్ర‌స్దానంలో ఉన్నారు. వీరిద్ద‌రూ కేవ‌లం 39 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నారు.

అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా స్మిత్(4) రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు డేవిడ్‌ వార్న‌ర్‌, బెన్ మెక్‌డెర్మాట్‌ల పేరిట ఉండేది. వారిద్ద‌రూ త‌మ బీబీఎల్ కెరీర్‌లో మూడు సెంచ‌రీలు చేశాడు. తాజా సెంచ‌రీతో వీరిద్ద‌రిని స్మిత్ వెన‌క్కి నెట్టాడు.
చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement