రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.
అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్‌దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
"బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్‌తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్‌దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.
అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.
అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్‌లు ఆడకుండా బెంచ్‌పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు


