టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సుందర్ గాయపడ్డాడు.
దీంతో ఆఖరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పాల్గోనడం కూడా అనుమానంగా మారింది. సుందర్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. తొలుత అతడిది సాధారణ వెన్ను నొప్పి అని వైద్యులు భావించారు. కానీ తర్వాత స్కాన్లలో అతడి గాయం తీవ్రమైనది తేలింది.
దీంతో వాషింగ్టన్ మరో రెండు మూడు రోజుల్లో పునరావాసం పొందేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. అక్కడి వైద్య బృందం సుందర్ పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంపై స్పష్టత ఇవ్వనున్నారు. అయితే సుందర్ విషయంలో బీసీసీఐ ప్లాన్ బితో ఉన్నట్లు తెలుస్తోంది.
"వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్ లీగ్ దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే సూచనలు కన్పించడం లేదు. కాబట్టి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాకప్ ప్లాన్ గురుంచి కచ్చితంగా ఆలోచించాలి. మెడికల్ టీమ్ నుంచి పూర్తి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
భారత్ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌లు ఎక్కువగా అసోసియేట్ జట్లతో ఆడాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి సుందర్ స్ధానంలో ఎవరినీ భర్తీ చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉండకపోవచ్చు. అతడు కోలుకోవడానికి తగినంత సమయం దొరికే అవకాశముంది. సుందర్ జట్టుతో పాటు కొనసాగే అవకాశముంది.
ఒకవేళ అతడు టోర్నీ కీలక దశ సమయానికి కోలుకుంటే నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో రానున్నాడని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా జనవరి 31 లోపు జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఒకవేళ సుందర్ గ్రూప్ దశ దాటాక కూడా కోలుకోలేడని తేలితే, అతడి స్ధానంలో మరొక ఆటగాడిని బీసీసీఐ తీసుకుంటుంది. సుందర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్, అయూశ్ బదోని, షాబాజ్ అహ్మద్ వంటి వారు రేసులో ఉన్నారు.
చదవండి: The Hundred 2026: స్మృతి మంధాన కీలక నిర్ణయం


