చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ | Perth Scorchers beat CSK and MI to become the most successful T20 franchise | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ

Jan 26 2026 6:47 PM | Updated on Jan 26 2026 6:50 PM

Perth Scorchers beat CSK and MI to become the most successful T20 franchise

బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ పెర్త్‌ స్కార్చర్స్‌ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్‌ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. 

తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్‌ ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్‌కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్‌ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్‌ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.

స్కార్చర్స్‌ విషయానికొస్తే.. తాజా బీబీఎల్‌ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్‌ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్‌ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకుంది.

టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు 
పెర్త్‌ స్కార్చర్స్‌ (బిగ్‌బాష్‌ లీగ్‌)- 6
ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఐపీఎల్‌)- 5
కొమిలా విక్టోరియన్స్‌ (బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌)- 4
జాఫ్నా కింగ్స్‌ (లంక ప్రీమియర్‌ లీగ్‌)- 4
ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌)- 3
ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ (హండ్రెడ్‌ లీగ్‌)- 3
సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)- 3
ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20)- 2
ఎంఐ న్యూయార్క్‌ (మేజర్‌ లీగ్‌ క్రికెట్‌)- 2

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 ఫైనల్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement