బిగ్‌బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
ఫలితంగా స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అలెన్‌కు ఇది ఐదో శతకం. బీబీఎల్‌లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్‌లోనూ జోష్ నింపింది. అలెన్‌కు కేకేఆర్ 2026 సీజన్ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన అలెన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. కేవలం 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్ సంధు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో అలెన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అలెన్ ఊచకోత కోయడంతో స్కార్చర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్.. అలెన్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్ మార్ష్ 20, కూపర్ కన్నోలీ 18, ఆరోన్ హార్డీ 22, ఆస్టన్ టర్నర్ 13, లారీ ఈవాన్స్ 21, నిక్ హాబ్సన్ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో సామ్ ఇలియట్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ తడబడింది. టిమ్ సీఫర్ట్ (66), జేక్ ఫ్రేజర్ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్ బౌలర్లు కన్నోలీ, బియర్డ్‌మన్ తలో 2, లూక్ హాల్ట్, ఆరోన్ హార్డీ చెరో వికెట్ తీసి రెనెగేడ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది.


