స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ప్లేయర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్.. తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్‌లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.
CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్ నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.
సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడతాడు.
జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో శ్రేయస్ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 (వడోదర), 14 (రాజ్‌కోట్), 18 (ఇండోర్) తేదీల్లో జరుగనుంది.
కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.
మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు.


