రికార్డుల రారాణి, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్ పేరిట ఉండేది.
మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్‌లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.
చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఈమెకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10868), న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్ (10652), ఇంగ్లండ్‌కు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.
టీమిండియా భారీ స్కోర్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది.
సిరీస్ ఇదివరకే కైవసం
కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.


