
ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 29) రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.
రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (68 నాటౌట్), సందీప్ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, కైల్ మేయర్స్ తలో 2, జెడియా బ్లేడ్స్ ఓ వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్ ఆదిల్ ఆలం (4-0-24-3), కుషాల్ భుర్టెల్ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్ ఎయిరీ (3-0-4-1), లలిత్ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్ జట్టుకు (నేపాల్) ఫుల్ మెంబర్ జట్టుపై (వెస్టిండీస్) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్ చేసిన 83 పరుగుల స్కోర్, ఓ అసోసియేట్ జట్టుపై ఓ ఫుల్ మెంబర్ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగనుంది.
చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం