ఇటీవలికాలంలో భారత పురుషుల క్రికెట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. దీంతో ఫార్మాట్‌కు ఒక్క జట్టు సరిపోదనే వాదన వినిపిస్తుంది. ఓ దశలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రెండు జట్లతో ప్రయోగం కూడా చేసింది.
1998 సెప్టెంబర్‌లో తొలిసారి సీనియర్ పురుషుల క్రికెట్ జట్లు రెండు వేర్వేరు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నాయి. అజయ్ జడేజా నేతృత్వంలో ఓ జట్టు మలేసియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనగా.. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో మరో జట్టు కెనడాలో పాకిస్తాన్‌తో సహారా కప్ ఆడింది. కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొన్న జట్టులో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే లాంటి స్టార్ ఆటగాళ్లు ఉండగా.. సహారా కప్ జట్టుకు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.
ఇలాంటి ప్రయోగమే 2021లో మరోసారి జరిగింది. షెడ్యూల్ క్లాష్ కావడంతో రెండు వేర్వేరు భారత జట్లు ఇంగ్లండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడగా.. శిఖర్ ధవన్ సారథ్యంలోని జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడింది.
పై రెండు సందర్భాల్లో ఒకే సమయంలో రెండు వేర్వేరు భారత జట్లు ఆడటమనేది షెడ్యూల్ క్లాష్ కావడం వల్ల జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విషయం అది కాదు. షెడ్యూల్ క్లాష్ కాకపోయినా భారత్‌కు రెండు వేర్వేరు జట్ల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 11 బెర్త్‌ల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఏ స్థానం తీసుకున్నా, అర్హులైన ఆటగాళ్లు కనీసం పదుల సంఖ్యలో ఉన్నారు.
వీరిలో ఒకరికి న్యాయం చేస్తే, మిగతా తొమ్మిది మందికి అన్యాయం జరుగుతుంది. అందుకే మల్టిపుల్ జట్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది. ఇలా చేస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించినట్లవుతుంది. అలాగే వారి టాలెంట్‌కు కూడా న్యాయం చేసినట్లవుతుంది.
ఇటీవలికాలంలో మూడు ఫార్మాట్ల భారత జట్లలో ఒకరిద్దరికి క్రమం తప్పకుండా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు సంజూ శాంసన్. సంజూ టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా క్రమం తప్పకుండా రాణిస్తున్నా, శుభ్‌మన్ గిల్ కారణంగా అతడికి అవకాశాలు రాలేదు. తాజాగా భారత సెలెక్షన్ కమిటీ సంజూకి న్యాయం (గిల్‌ను పక్కన పెట్టి టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక) చేసినప్పటికీ.. వేరే కోణంలో విమర్శలు మొదలయ్యాయి.
తీవ్రమైన పోటీ కారణంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం దక్కని ఆటగాళ్లు సంజూ కాకుండా చాలామంది ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, పడిక్కల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, సిరాజ్, షమీ, చహల్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్ లాంటి వారు అర్హులై, క్రమంగా రాణిస్తున్నా తుది జట్లలో అవకాశాలు రావడం లేదు. వచ్చినా ఏదో ఒక ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు.
బెర్త్‌లు పదకొండే కావడంతో స్టార్ ప్లేయర్లకు కూడా కొన్ని ఫార్మాట్లలో ఈ కష్టాలు తప్పడం లేదు. కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు వాస్తవానికి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా అతనికి టీ20 జట్టులో అవకాశం దక్కడం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా, అతనిదీ ఇదే అనుభవం. రిషబ్ పంత్ లాంటి డాషింగ్ బ్యాటర్ పరిస్థితి అయితే మరీ దారుణం.
అతన్ని కేవలం టెస్ట్‌ల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. వాస్తవానికి అతనికి ఉన్న దూకుడుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెట్ ప్లేయర్. అయినా పరిమిత బెర్త్‌ల కారణంగా పంత్ సింగిల్ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లో సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆకాశ్‌దీప్ లాంటి వారి పరిస్థితి కూడా ఇదే. షమీ లాంటి వారికైతే మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నా కనీసం ఒక్క ఫార్మాట్ జట్టులోనూ చోటు దక్కడం లేదు.
మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది. అదే.. గతంలో మాదిరి మూడు ఫార్మాట్లకు ఒకే జట్టు ఉంటే సెలెక్టర్లకు ఊపిరి తీసుకోవడం సాధ్యమయ్యేదా..? ఏ ప్లేయర్ అయినా తాను ఏదో ఒక్క ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించాలని ప్రతి ఒక్కరు కలగంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాట్‌కు ఒక జట్టు ఎంపిక చేసే దానికంటే, పోటీ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్‌కు ఒకటికి మించిన జట్లను ఎంపిక చేయడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అర్హుడైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఉంటుంది.
అయితే ఇలా చేసేటప్పుడు సీనియర్ జట్టు, జూనియర్ జట్టు అన్న తేడాలు ఉండకుండా చూసుకుంటే మంచింది. ఎందుకంటే, ఏ టాలెండెడ్ ఆటగాడైనా తాను ఎక్కువ-తక్కువగా ఉండాలని అనుకోడు.చిన్న జట్లు, పెద్ద జట్లు అన్న తేడా లేకుండా అన్ని జట్లు సమానంగా మ్యాచ్‌లు ఆడాలి. మరి ఇలాంటి ప్రయోగానికి బీసీసీఐ ఎప్పుడు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.


