T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి.. | T20 WC 2026: Pakistan Beat Netherlands In Last Over Thirller | Sakshi
Sakshi News home page

T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

Feb 7 2026 2:49 PM | Updated on Feb 7 2026 3:19 PM

T20 WC 2026: Pakistan Beat Netherlands In Last Over Thirller

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. గ్రూప్‌-ఎ నుంచి ఇరుజట్ల మధ్య పోటీ జరుగగా.. సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

147 పరుగులు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో మైకేల్‌ లెవిట్‌ (24) ఫర్వాలేదనిపించగా.. బాస్‌డీ లీడే (30), కొలిన్‌ అకెర్‌మాన్‌ (20), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (37) రాణించారు. 

పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్‌ నవాజ్‌, అబ్రార్‌ అహ్మద్‌, సయీబ్‌ ఆయుబ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో షాహిన్‌ ఆఫ్రిది ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

ఓపెనర్ల శుభారంభం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47), సయీబ్‌ ఆయుబ్‌ (13 బంతుల్లో 24) శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12)తో పాటు బాబర్‌ ఆజం (15) తడబడగా.. ఉస్మాన్‌ ఖాన్‌ (0) డకౌట్‌ అయ్యాడు.

మారిన సీన్‌.. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ
షాబాద్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) చేతులెత్తేయగా.. ఆఖర్లో ఫాహీమ్‌ అష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టాడు. అతడి తోడు షాహిన్‌ ఆఫ్రిది (5) అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి ఓవర్లో మూడో బంతికి ఆష్రఫ్‌ కష్టమ్మీద ఫోర్‌ బాదగా పాక్‌ గెలుపు ఖరారైంది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన పాక్‌.. మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.

కాగా నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్‌.. ఆయుబ్‌, ఆఘా రూపంలో రెండు కీలక వికెట్లు తీయగా.. పాల్‌ వాన్‌ మీకెరెన్‌ సాహిబ్‌జాదా, ఉస్మాన్‌ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో లోగాన్‌ వాన్‌ బీక్‌, కైలీ క్లెయిన్‌, వాన్‌ డెర్‌ మెర్వె తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో పాక్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్‌!.. మరీ ఆ షాట్లు అలా ఆడితే ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement