విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్ ఈ ఏడాది 69 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హోల్డర్ (అబుదాబీ నైట్‌రైడర్స్) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
హోల్డర్‌కు ముందు ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ 2018లో 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో, నూర్ అహ్మద్ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఇదే ఏడాది 64 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీశాడు.
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్
హోల్డర్ ఇటీవలికాలంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన హోల్డర్‌ను ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
హోల్డర్ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్ (66) ఉన్నారు. రషీద్ ఖాన్ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్‌వెల్


