టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో తాము తప్పక సెమీ ఫైనల్ చేరతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను సరదాగా ట్రోల్ చేశాడు రషీద్ ఖాన్.
టీ20 వరల్డ్‌కప్ గత ఎడిషన్ అమెరికా- వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో అఫ్గనిస్తాన్ అనూహ్య రీతిలో సెమీస్ చేరి సత్తా చాటింది. అయితే, సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో నిరాశగా ఇంటిబాట పట్టింది.
ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య వరల్డ్‌కప్ 2026 ఎడిషన్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన రషీద్ ఖాన్ (Rashid Khan)కు.. ‘ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది.
ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి..
ఇందుకు బదులిస్తూ 2024లో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను రషీద్ ఖాన్ గుర్తు చేశాడు. ‘‘మీకు గుర్తుందా? 2024 వరల్డ్‌కప్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి.. మిగిలినవి మిమ్మల్నే ఎంచుకోమన్నాడు’’ అంటూ కమిన్స్‌ను టీజ్ చేశాడు.
కాగా గతంలో కమిన్స్ (Pat Cummins) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్ చేరుతుంది. మిగిలిన మూడు జట్లు ఏవైనా మాకు సంబంధం లేదు. డోంట్ కేర్’’ అని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ తాజాగా కమిన్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అఫ్గనిస్తాన్ తప్పక సెమీస్ చేరుతుందని చెప్పకనే చెప్పాడు.
సెమీస్ చేరే జట్లు ఇవే
అయితే, టోర్నీ ఆరంభంలోనే ఈ అంచనాలు సరికావన్న రషీద్ ఖాన్.. పిచ్ పరిస్థితులు, జట్ల బలాబలాల దృష్ట్యా సెమీ ఫైనల్ చేరే నాలుగు జట్లను ఎంచుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో పాటు టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టాప్-4లో నిలుస్తాయని రషీద్ ఖాన్ జోస్యం చెప్పాడు.
కాగా ఇరవై జట్లు పాల్గొంటున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, కెనడా, యూఏఈలతో కలిసి అఫ్గనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది. ఈ ఐసీసీ ఈవెంట్లో భాగంగా.. ఫిబ్రవరి 8న కివీస్‌తో.. ఫిబ్రవరి 11న సఫారీలతో.. ఫిబ్రవరి 16న యూఏఈతో.. ఫిబ్రవరి 19న కెనడాతో అఫ్గన్ తలపడుతుంది.
చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్‌కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
That "don't care" was personal 😭 pic.twitter.com/SLFoz0fGFK
— EngiNerd. (@mainbhiengineer) June 15, 2024


