టీ20 ప్రపంచకప్-2024లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై సంచలన రీతిలో 84 పరుగుల తేడాతో గెలిచి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది రషీద్ ఖాన్ బృందం.
సంచలన రీతిలో సెమీస్‌లోకి
ఇక సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి.. అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అనంతరం బంగ్లాదేశ్‌పై 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటంతో ఫైనల్ చేరాలన్న అఫ్గన్ ఆశలు కరిగిపోయాయి.
ఏదేమైనా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఓడించిన అఫ్గనిస్తాన్‌కు ప్రశంసలైతే దక్కాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అఫ్గనిస్తాన్‌పై ఓ మోస్తరుగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉపఖండ పిచ్‌లపై ఈ ఈవెంట్ జరుగనుండటం వారికి సానుకూలాంశంగా మారింది.
షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ కలిసివస్తాయా?
కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. నాలుగు గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యూఏఈ, కెనడాలతో కలిసి అఫ్గనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది.
అయితే, ఈసారి లీగ్ దశలో షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ కూడా అఫ్గనిస్తాన్‌కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యూఏఈలతో మ్యాచ్‌లు మధ్యాహ్నం వేళ (ఉదయం 11 గంటలకు ఆరంభం) జరుగనున్నాయి. ఇందుకు చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలు. కాగా రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అందుకు భిన్నంగా డే మ్యాచ్‌లలో తేమ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. తమకు ప్రధాన బలమైన స్పిన్ దళంతో అఫ్గన్ అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా చెన్నై పిచ్ స్పిన్‌కు ఎంత అనుకూలమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మేటి స్పిన్ దళం
ప్రస్తుతం అఫ్గనిస్తాన్ జట్టులో కెప్టెన్ రషీద్ ఖాన్ వంటి మేటి స్పిన్నర్‌తో పాటు నూర్ అహ్మద్, మహ్మద్ నబీ వంటి క్వాలిటీ స్పిన్ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ముజీబ్ ఉర్ రహమాన్ కూడా ఉండనే ఉన్నాడు.
ప్రస్తుతం ఇంతకంటే అత్యుత్తమ స్పిన్ దళం ఉన్న మరో జట్టు లేదనే చెప్పవచ్చు. కాబట్టి మంచు ప్రభావం లేని మధ్యాహ్న మ్యాచ్‌లలో వీరు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆల్‌రౌండర్ల బలం
అదే విధంగా జట్టులో మెరుగైన ఆల్‌రౌండర్లు ఉండటం కూడా అఫ్గనిస్తాన్‌కు కలిసి వచ్చే అంశం. గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ బ్యాట్‌తోనూ సత్తా చాటగలరు. ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా లోయర్ ఆర్డర్‌లో సేవలు అందించగలడు.
కాబట్టి ఈసారి ఉపఖండ పిచ్‌లపై జరిగే వరల్డ్‌కప్ టోర్నీలో అఫ్గనిస్తాన్‌కు స్పిన్నర్లుగానే కాకుండా.. ఆల్‌రౌండర్లుగా రెండు పాత్రలు పోషించగల ఆటగాళ్లు ప్రధాన బలంగా మారనున్నారని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లోనూ స్పిన్ ఫ్రెండ్లీ అయిన అమెరికా- వెస్టిండీస్ పిచ్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకున్న అఫ్గన్ సెమీస్ వరకు చేరిన విషయం తెలిసిందే.
చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్‌కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక


