అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెల్‌బోర్న్ పిచ్‌పై అసంతృప్తి వెలిబుచ్చింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో నాలుగో టెస్టుకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికైంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ పిచ్ పేలవమని ప్రకటించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘ఏకపక్షంగా బౌలర్లకు మాత్రమే సహకరించిన వికెట్’ అని ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఐసీసీ ఎంసీజీ అసంతృప్తిపరిచిన వేదిక అని... ఒక డిమెరిట్ పాయింట్ విధించింది.
ఏదైనా వేదికకు 6 డిమెరిట్ పాయింట్లు జమ అయితే ఆ స్టేడియాన్ని 12 నెలల పాటు నిషేధిస్తారు. 26న మొదలైన ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టు అత్యంత నిరుత్సాహకరంగా మరునాడే ముగిసింది. ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్‌లో మొదటి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. 20 వికెట్లు నేలకూలాయి. తర్వాతి రోజు 16 వికెట్లు పడ్డాయి. ఆ్రస్టేలియాలో ‘బాక్సింగ్ డే’ టెస్టుకున్న ప్రత్యేకతే వేరు.
ఏకంగా 90 వేలకు పైగానే ప్రేక్షకులు పోటెత్తిన ఈ మ్యాచ్ అనూహ్యంగా రెండే రోజుల్లో ముగియడం క్రికెట్ అభిమానుల్ని సైతం నిరాశపరిచింది. ఈ టెస్టుకు ముందే యాషెస్‌ను గెలుచుకున్న ఆతిథ్య ఆ్రస్టేలియా... ప్రస్తుతం 3–1తో ఇంగ్లండ్‌పై పైచేయిని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.
చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్


