అభిప్రాయం
నేపాల్‌లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.
2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?
కనీసం ప్రశ్నించుకోని వైనం
ఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.
మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్‌వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి.
ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.
రాజకీయ శూన్యం
జెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్‌లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు.
ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!
పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి.
అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.
కోల్పోయిన విశ్వాసం
వీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు.
తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


