ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
డఫీకి పేస్‌తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్‌లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో డఫీ ప్రదర్శనలు..
తొలి టెస్ట్: 5-34 & 3-122
రెండో టెస్ట్: 1-33 & 5-38
మూడో టెస్ట్: 4-86 & 5-42
టెస్ట్‌ల్లో విశ్వరూపం
2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్‌ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.
లీడింగ్ వికెట్‌టేకర్
టెస్ట్‌ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్‌గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు.
డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్‌కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్‌గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.
ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు..
టీ20లు- 35 వికెట్లు
టెస్ట్‌లు- 25 వికెట్లు
వన్డేలు- 21 వికెట్లు
ఓ క్యాలెండర్ ఇయర్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు..
జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు)
రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79)
డేనియల్ వెటోరి (2008లో 76)
ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)
ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్‌లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు.


